calender_icon.png 29 October, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీచైతన్య పాఠశాలలో టీచర్ల బాయ్‌ కాట్‌!

29-10-2025 10:27:04 AM

  1. ప్రిన్సిపల్‌ వైఖరిని నిరసిస్తూ ఆందోళన
  2. విధులు బహిష్కరించి వెళ్లిపోయిన ఉపాధ్యాయులు
  3. శ్రీచైతన్య స్కూల్‌లో నిత్యం ఏదో ఒక ఘటన
  4. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రుల ఆందోళన

తుర్కయంజాల్‌: తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, అంచనాలతో తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొన్ని స్కూళ్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. మనల్ని ఆపేదెవరంటూ ఇష్టమొచ్చినట్లు స్కూళ్లు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సరైన సౌకర్యాలు కల్పించకపోవడం పరిపాటిగా మారింది. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీచైతన్య స్కూల్‌లో(Sri Chaitanya School) మౌలిక సదుపాయాలు పక్కన బెడితే... కనీసం ఉపాధ్యాయుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.

టీచర్లకు జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా, వారిపట్ల ప్రిన్సిపల్‌ కర్కషంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో ప్రిన్సిపల్‌ వైఖరిని నిరసిస్తూ మంగళవారం రోజున ఏకంగా స్కూల్‌ను బాయ్‌కాట్‌(Teachers boycott) చేసి వెళ్లిపోయారు ఉపాధ్యాయులు. ఇదేమిటని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ ఒకేసారి లీవ్‌ పెట్టి వెళ్లిపోయారని సమాధానమిచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేవంటూ గతంలో పలుమార్లు ఇదే పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. స్కూల్‌ బిల్డింగ్‌ను సైతం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారన్న ఆరోపణలున్నాయి. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్కూల్‌ ను యథావిధిగా నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

దిక్కుతోచని స్థితిలో పేరెంట్స్‌!

ఇబ్రహీంపట్నంలోని శ్రీచైతన్య స్కూల్‌ను సీజ్‌ చేసిన మరుసటి రోజే తుర్కయంజాల్‌లో మరో ఘటన జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయ స్థితిలో పడ్డారు. తమ పాఠశాలలో చేర్పిస్తే మీ పిల్లలకు ఐఐటీ కోర్సులు నేర్పిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని ఊదరగొట్టి పాఠశాలలో చేర్పించుకున్నారు. నిత్యం ఏదో ఒక సమస్య స్కూల్‌లో చోటు చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో తమ పిల్లలకు ఏమి బోధిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్లే ఇలాంటి పాఠశాలలు పుట్టుకొచ్చి, విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్నాయని పలువురు మండిపడుతున్నారు.