calender_icon.png 29 October, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృత్యు శకటం "డెల్టా" ప్యాసింజర్ రైలు ప్రమాదానికి నేటికి 20 ఏండ్లు

29-10-2025 08:50:04 AM

నాటి ప్రమాదంలో 116 మంది మృతి

వలిగొండ, (విజయక్రాంతి): వలిగొండ మండలంలో(Valigonda rail accident) గోల్నేపల్లి గ్రామం పరిధిలో గల రైలు వంతెన భారీ వర్షాలకు కొట్టుకపోవడంతో డెల్టా ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురై 116 మంది మృతి చెందగా, వందల పదిమంది గాయపడిన సంఘటనకు నేటికీ 20 ఏండ్లు కావస్తుంది. నాటి ప్రమాదం వివరాల్లోకి వెళితే అది తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతం అక్టోబర్ 29, 2005 డెల్టా  ప్యాసింజర్ రైలు రేపల్లె నుండి కాచిగూడకు జోరుగా కురుస్తున్న వర్షంలో చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది.

రైలులో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా మరి కొంతమంది కొద్దిసేపట్లో తమ గమ్యస్థానం చేరుకుంటామని ఎదురుచూస్తున్నారు. సరిగ్గా రైలు వలిగొండ మండలంలోని గొల్లేపల్లి గ్రామం పరిధిలోగల రైల్వే వంతెన మీదుగా వెళ్తుంది. అయితే భారీ వర్షాల కారణంగా గోల్నేపల్లి చెరువు కట్ట తెగిపోయి భారీ వరద నీరు వేగంగా రైల్వే ట్రాక్ కింద వంతెనను తాకడంతో వంతెన కొట్టుకపోయింది. అయితే వంతెన కొట్టుకుపోయి వేలాడుతున్న రైల్వే ట్రాక్ మీద నుండి రైలు వెళ్లడంతో వరద నీటిలో రైలు పడిపోయి, భోగీలు ఒకదానికొకటి ఢీకొనడంతో భోగిలని ధ్వంసం అయ్యాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏం జరిగిందో తెలిసేలోపే నిద్రలోనే ఎంతో మంది మృత్యువాత పడగా, వందలాదిమంది గాయపడ్డారు.

నాటి డెల్టా రైలు ప్యాసింజర్ రైలు ప్రమాదం రైల్వే చరిత్రలో అత్యంత భారీ ప్రమాదాలలో ఒకటిగా నమోదు కాగా రైలు ప్రమాదాన్ని నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా పరిశీలించి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీ వరద కారణంగా నీటిలో కిలోమీటర్ దూరం కొట్టుకపోయి మృతి చెందిన వారు కూడా ఉండగా మృతదేహాల కోసం రోజుల తరబడి వెతికిన హృదయ విదారక సంఘటనలు,  కంటతడి పెట్టించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నాటి డెల్టా ప్యాసింజర్ రైలు ప్రమాదం సహాయక చర్యలు చర్యల్లో సైన్యం, ఎన్డిఆర్ఎఫ్, పోలీస్, రెవిన్యూ, హెల్త్, ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొనగా సమీప గ్రామాల ప్రజలు మానవతా దృక్పథంతో రోజుల తరబడి తమ సహాయ, సహకారాలను అందించారు.