29-10-2025 09:21:46 AM
అచ్చంపేట: మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లమల్లలో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షం ప్రభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర ఆలయాన్ని(Uma Maheshwaram temple ) తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవరెడ్డి, యువ శ్రీనివాసరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆలయ సమీపంలోని కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే ఆలయానికి వచ్చే మార్గంలోని రహదారిపై భారీగా వర్షం నీరు వస్తున్నాడంటూ వాహనాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. దీంతో ఆలయానికి ఒక్కరోజు తాత్కాలికంగా మూసివేస్తున్నామని భక్తులు సహకరించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అచ్చంపేటలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రాజీవ్ నగర్ కాలనీలో జనజీవనం స్తంభించింది. చంద్ర సాగర్ పై నుంచి వర్షం నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. అచ్చంపేట ఉప్పునుంతల మార్గంలోని దేవదారుకుంట వద్ద, అమ్రాబాద్ నుంచి మద్దిమడుగు వెళ్లే మార్గంలోని కుమ్మరినిపల్లి వద్ద రోడ్డుపై భారీగా వర్షం నిల నిలవడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.