02-09-2025 12:44:54 AM
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
-మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. పద్మకు నియామకపత్రం అందజేత
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 1 (విజయక్రాంతి):ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళల పక్షపాతి అని, అన్ని రంగాల్లోమహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఆలోచిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ్య సభ్యులు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లులో జనాభా ప్రాతిపదికన బీసీ మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన జి. పద్మకు కృష్ణయ్య నియామక పత్రాన్ని కృష్ణయ్య అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షురాలు అనురాధ గౌడ్, భాగ్యలక్ష్మిపద్మకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళలకు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే ఆ బిల్లుకు సార్థకత ఉండదని ఆయన అన్నారు.
మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వారిపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు. ‘బీసీలంటే చిన్న చూపా? సబ్-కోటా గురించి అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?‘ అని ఆయన నిలదీశారు. జనాభాలో సగం ఉన్న బీసీ మహిళలకు కోటా ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.