02-09-2025 12:43:36 AM
* శ్రీరాంసాగర్ నీళ్లను పంపింగ్ చేసిన అధికారులు
* భ్రమల్లో ముంచుతున్న బీఆర్‌ఎస్
* విజయక్రాంతి’ పరిశీలన
హుస్నాబాద్, సెప్టెంబరు 1 : కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గౌరవెల్లి ప్రా జెక్టు నీటితో తెలంగాణతల్లి విగ్రహానికి అభిషేకం చేసిన బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ప్రాజెక్టులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చా యని వారు చేసిన ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందని తేలింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ట్రయల్ రన్ మాత్రమే పూర్తయింది.
ఈ ట్రయల్ రన్ కోసం నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ (ఎస్సారెస్పీ) నుంచి మధ్య మానేరు ద్వారా తోటపల్లి రిజర్వాయ ర్కు తరలించారు. అక్కడి నుంచి గౌరవెల్లి ప్రాజెక్టులోకి నీటిని పంపింగ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గౌరవెల్లికి నీళ్లు తరలిం చే కాలువల నిర్మాణం ఇంకా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టులో ఉన్నవి శ్రీరాంసాగర్ జలాలు మాత్రమే.
బీఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ పచ్చబడింది అని వాదిస్తూ, గౌరవెల్లి ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీళ్లు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు, నిపుణులు విమర్శిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని, వాస్తవాలను గుర్తించాలని సూచిస్తున్నారు. సోమవారం బీఆర్ ఎస్ కార్యకర్తల జలాభిషేకంతో గౌరవెల్లి ప్రాజెక్టు మరోసారి రాజకీయ చర్చకు తెరలేపింది.
బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రాజెక్టులోని నీటితో అక్కన్నపేట మండ లం జనగామలోని తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేసి, ‘కాళేశ్వరం నీళ్లు వచ్చా యి‘ అని ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే, ఇది ప్రజల ముందున్న మరో రాజకీయ నాటకమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
బీఆర్‌ఎస్ నాయకులు ఈ జలాభిషేకాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ‘కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుల వల్లే తెలంగాణ పచ్చని పొలాలుగా మారింది. కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చాయి‘ అని వారు పదేపదే చెబుతున్నారు. ఈ మా టలు సాధారణ ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయి. అధికారిక రికార్డులు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. 2023లో నిర్వహించినది ట్రయల్ రన్ మాత్రమే.
ఈ ట్రయల్ రన్లో శ్రీరాంసాగర్ నుంచి పంప్ చేసిన నీటినే రిజర్వాయర్లోకి వదిలారు. ఇప్పటివరకు కాళేశ్వరం నుంచి ఒక్క బిందె నీరు కూడా గౌరవెల్లిలోకి రాలేదు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్న ‘కాళేశ్వరం నీళ్లు‘ అన్నది వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నంగానే కనిపిస్తోంది.ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నాణ్యతా లోపాలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
ప్రాజె క్టు వ్యయం రూ.38,000 కోట్ల నుంచి రూ. 1.47 లక్షల కోట్లకు పెరిగిందని, నిపుణుల నివేదికలను తొక్కిపెట్టారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తమ పాలనలో నిర్మించిన ప్రా జెక్టులను విజయగాథలుగా చూపించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. గౌరవెల్లి ప్రాజెక్టులోని నీటిని కాళేశ్వరం విజయానికి ప్రతీకగా చూపించడం, ప్రజల విశ్వా సాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజా విశ్వాసానికి ప్రమాదం
తెలంగాణ తల్లికి జలాభిషేకం చేయడం ఒక భావోద్వేగ చర్య. అయితే ఆ నీటి మూ లాన్ని తప్పుగా చెప్పడం ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య. రాజకీయ లాభం కోసం వాస్తవాలను వక్రీకరించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఒక ప్రాజెక్టు ఇంకా పూర్తికాకపోయినా, దాన్ని ‘విజయోత్సవం‘గా మార్చి ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.
గౌరవెల్లి ప్రాజెక్టులోని నీటి కథ ఒక చిన్న ఇంజినీరింగ్ నిజం మాత్రమే కాదు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం వర్సెస్ వాస్తవం అనే యుద్ధానికి ప్రతీక. జలాభిషేకం జరిగిందనేది నిజం. కానీ అది కాళేశ్వరం విజయానికి నిదర్శనం కాదనేది అంతకన్నా పెద్ద నిజం. ప్రజలు ప్రచారం, వాస్తవాల మధ్య తేడాను గుర్తించకపోతే రేపటి రాజకీయాలు కేవలం ప్రచార బుడగలే అవుతాయి.