02-09-2025 10:19:06 AM
హైదరాబాద్: లండన్ లోని ఎసెక్స్‌లో రెండు కార్లు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు(Telugu students) మరణించారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందినవారు. మృతులు నాదర్ గుల్ వాసి చైతన్య(22), ఉప్పల్ వాసి రిషితేజ(21)గా గుర్తించారు. రిషితేజ యూకేలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఎల్ బీ నగర్‌లో నివసిస్తున్నారు. ఎసెక్స్ పోలీసులు(Essex Police) తెలిపిన వివరాల ప్రకారం, రేలీ స్పర్ రౌండ్అబౌట్ వద్ద డ్యూయల్ క్యారేజ్‌వే A130పై ఈ ప్రమాదం జరిగింది.
బార్కింగ్ ప్రాంతంలో నివసించే తొమ్మిది మంది స్నేహితులు, రూమ్‌మేట్‌ల బృందం సౌథెండ్-ఆన్-సీ తీరప్రాంత పట్టణానికి ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నాయి. ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించారు. తరువాత వారు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. బాధితులంతా తెలుగురాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. సౌత్ బెన్‌ఫ్లీట్‌లోని సాడ్లర్స్ ఫార్మ్ రౌండ్‌అబౌట్ (A13), బాటిల్స్‌బ్రిడ్జ్ (A1245) వద్ద ఉన్న రెట్టెండన్ టర్న్‌పైక్ మధ్య డ్యూయల్ క్యారేజ్‌వే ప్రమాదం తర్వాత ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఎసెక్స్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ నివేదించింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించారు.