02-09-2025 12:52:42 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూ టరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం, ఉద్యోగి వాటా పది శాతం కలిపి మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే దాని పై కేంద్ర ప్రభుత్వ పెత్తనమెందుకని ప్రశ్నించారు.
మన పైసలను మనం విత్‌డ్రా చేసు కోకుండా కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సీపీఎస్‌ను రద్దుచేయకుంటే.. తమ డిమాండ్‌ను తీర్చగల ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులే తెచ్చుకుంటారని హెచ్చరించారు. ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ)- టీఎస్ సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహదినాన్ని (సెప్టెంబర్ 1) పురస్కరించుకొని సోమ వారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు.
ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. ప్రతిఒక్కరూ నల్ల దుస్తువులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. రాష్ర్ట సంఘ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాకు శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గత 21 ఏండ్లుగా సీపీఎస్ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పరిచిన విధంగా వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్టీ యూ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం, వ్యతిరేకం కాదని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. గతంలో ఉద్యమాల ద్వారా అనేక జీవోలు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
మూడు పార్టీల భాగస్వామ్యం..
రాష్ర్టంలో సీపీఎస్ అమలులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు పార్టీల భాగస్వామ్యం ఉందని, ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉందని శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ రద్దుచేయని పక్షంలో సీపీఎస్‌ను రద్దుపరచే ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులే తెచ్చుకుంటారని చెప్పారు.
తాము దాచుకున్న పైసలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెత్తనమేందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేశాక, దేశవ్యాప్త రద్దు కోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపడతామని, అందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలిపునిచ్చారు. సీపీఎస్ ఉద్యోగి దాచుకున్న ప్రతీ పైసా వారి జీపీఎఫ్ ఖాతాలో జమయ్యేవరకు పీఆర్టీయూ పోరాటం చేస్తోందన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని, కమిటీలతోనే కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఫైనాన్షియల్, నాన్‌ఫైనాన్షియల్ సమస్యలను వేర్వేరుగా పరిష్కరిస్తామని చెప్పి, వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే మూడుసార్లు ఉద్యోగులు కార్యాచరణను ప్రకటించాల్సి వచ్చిందని, అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్‌ను ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మిగతా రాష్ట్రాల్లోలాగా ఎందుకు చేయరు..
మిగతా రాష్ట్రాల్లోలాగా తెలంగాణలో ఎందుకు సీపీఎస్‌ను రద్దు చేయరని శ్రీపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వాలే సీపీఎస్‌ను రద్దు చేసుకోవచ్చని సమాధానమిచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు.
సీపీఎస్‌ను రద్దు చేయడం బీజేపీకి ఇష్టంలేదన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కొంత మంది ఐఏఎస్ అధికారుల తీరు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. మన డిమాండ్, ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని, ఈ ధర్నాతో ప్రభుత్వంలో కదిలిక రానిపక్షంలో పీఆర్టీయూ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
కేంద్రంపై పోరాడి సొమ్మును రాబట్టుకుంటాం: సీఎల్ రోజ్
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ సీఎల్ రోజ్ మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసిన రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని, ఉద్యోగి వాటా, రాష్ట్ర వాటాను తిరిగి చెల్లించమని అడగడం సరికాదన్నారు. కేంద్రంపై పోరాడి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును రాబట్టుకుంటామని స్పష్టం చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దయిందని, తెలంగాణలోనూ రద్దు చేయాలని, కేంద్రం కూడా తమ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: ఉద్యోగ జేఏసీ నేతలు
ఉపాధ్యాయుల మహాధర్నాకు సంఘీభావంగా హాజరైన ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్ సమస్యల సాధన కు జేఏసీ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిందని తెలిపారు. ఇందిరాపార్క్‌లో ఈరోజు జరిగిన పీఆర్టీయూ ఉపాధ్యాయుల ధర్నా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కదం తొక్క డం వారిలో ఉన్న ఆవేదనను తెలియజేస్తోందన్నారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, బీ గీత, చిత్తలూరి ప్రసాద్, పీఆర్టీయూ టీఎస్ సంఘం నాయకులు లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డి, టీటీ జేఏసీ నాయకులు రాజగంగారెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణమూర్తి, కటకం రమేశ్, కుత్బుద్దీన్, షకీల్ అహ్మద్, దిలీప్ రెడ్డి, జగదీశ్, పోచయ్య, విజయసాగర్, నాగరాజు, జగన్మోహన్ గుప్త, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, బేగరి బాలయ్య అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ధర్నాచౌక్ బ్లాక్..
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళనతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఉదయం నుంచే వివిధ జిల్లాలనుంచి వేలాదిగా వచ్చిన ఉపాధ్యాయులతో ధర్నాచౌక్ రోడ్డు మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఉపాధ్యాయులందరూ నల్లని దుస్తులతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు.