04-10-2025 05:21:13 PM
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ పిలుపు..
కరీంనగర్ (విజయక్రాంతి): త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల సత్తాచాటాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ పిలుపునిచ్చారు. కరీంనగర్ నగరంలోనీ మంకమ్మతోటలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధోగ్గలి శ్రీధర్ అధ్యక్షత వహించగా ముఖ్యాతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏన్నం ప్రకాష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలకతీతంగా బీసీలందరూ ఐక్యంగా ఉండి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకొని, 42 శాతం జీవో అమలు కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని, ఒకవేళ జీవో అమలు కాకపోతే, రాజకీయ పార్టీల ప్రకారంగా బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ మాయ మాటలు చెప్పే ప్రమాదం కూడా ఉందని దీనిని అన్ని రాజకీయ పార్టీల బీసీల నాయకులు గమనించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇదే ఎజెండాతో వస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేస్తామని బీసీ సంక్షేమ సంఘం తరుపున హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కల్లబొల్లి మాటలకు స్వస్తిపలికి, కోర్టులో జీవో అమలు కోసం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలు తమ పట్టు కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జనరల్ స్థానాలలో కూడా బీసీల సత్తాచాటాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు రాచమల్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేందర్, జిల్లా కార్యదర్శులు బండారు మల్లయ్య, నల్లవెల్లి రవి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మదాసు సంజీవ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.