calender_icon.png 5 August, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం

05-08-2025 01:39:41 AM

- పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి

- చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

- పార్లమెంటు వద్ద బీసీ ధర్నాలో ఎంపీ కృష్ణయ్య

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తరతరాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో వెనుకబడిపోయిన బీసీలు బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ఆ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ వద్ద ధర్నాలో పాల్గొన్న బీసీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్ ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి.. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలన్నారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ  ఖాళీలు భర్తీ చేయాలని, కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో బీసీ కులాల వారి లెక్కలు సేకరించాలని కోరారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూసిందని... కానీ బీజేపీ దేశంలో అత్యున్నతమైన ప్రధాని పదవిలో ఒక బీసీకి మూడు సార్లు అవకాశం కల్పించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని బీసీ కాదనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓబీసీ సామాజికవర్గ ప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.