20-05-2025 11:35:22 PM
నేషనల్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరిక..
హైదరాబాద్ (విజయక్రాంతి): దేశంలో అనుమతులు లేకుండా నడుస్తున్న మెడికల్ కాలేజీల(Medical Colleges)తో పాటు విదేశాల్లో అనుమతి లేని మెడికల్ కోర్సుల(Medical courses)పై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్(National Medical Council) హెచ్చరించింది. ఈ మేరకు సర్క్యూలర్ నెం.U-14021/UGMEB-2025 కు అనుసంధానంగా తాజాగా ఈ అడ్వైజరీ ద్వారా సూచించింది. వైద్యవిద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా సంస్థలకు కీలక సూచనలు చేసింది.
దేశంలో అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని మెడికల్ కాలేజీలు తమకు గుర్తింపు ఉందని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్నాయని, ఆ ప్రకటనలు నమ్మి నకిలీ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చని ఎన్‌ఎంసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో వైద్య విద్యలో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఎన్‌ఎంసీ అధికారిక వెబ్ సైట్ https://www.nmc.org.in/information-desk/college-and-course-search లో నమోదై ఉన్న కళాశాల్లోనే ప్రవేశాలు పొందాలని సూచించింది. విదేశాల్లో మెడికల్ విద్య అభ్యసించదలచిన విద్యార్థులు కోర్సు వ్యవధి, ఇంటర్న్ షిప్ తదితర కీలక అంశాలను గమనించాలని సూచనలు చేస్తూ అడ్వైజరీ విడుదల చేసినట్లు ఎన్‌ఎంసీ కార్యదర్శి డా. రాఘవ్ లాంగర్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో ప్రైవేటు రంగంలో 29, ప్రభుత్వ రంగంలో 36 ఎంబీబీఎస్ విద్యను అందించే మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 9065 సీట్లున్నట్లు ఎన్‌ఎంసీ వెల్లడించింది.