24-08-2025 04:17:08 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి పట్టణంలోని వాణినికేతన్ పాఠశాలలో ఆదివారం 1999-2000 పదవ తరగతి(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ(పెద్దసార్), ఉపాధ్యాయులు రాజ్ మహ్మద్, అనిల్, వేణు గోపాల్, కుమార్, అంజయ్య, సువర్చల, అనంతలక్ష్మి, రుక్సాన, రమాదేవిలు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజలన చేశారు.
పూర్వ విద్యార్థులందరు చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నెమరేసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ, సమిష్టి కృషి ఫలితమే వాణినికేతన్ గొప్పతనమన్నారు. తల్లిదండ్రులు ప్రధమ గురువులేనని గుర్తు చేశారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి దండ్రులు బాగస్వాములు కావాలన్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితమే విద్యార్థులు చాలా గొప్ప స్థాయిలో వున్నారని చెప్పారు.డబ్బు శాశ్వతం కాదని,పిల్లలను క్రమశిక్షణలో ఉంచినప్పుడే వారు ఉన్నత స్థానంలో ఉంటారన్నారు.