24-08-2025 03:47:05 PM
25 నుండి 30 వరకు తెలంగాణ విద్యార్థి పోరు యాత్ర
పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సురేష్
కామారెడ్డి (విజయక్రాంతి): పొలిటికల్ మైలేజ్ కోసమే విద్యారంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని పిడిఎస్యూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జి. సురేష్(PDSU District President Suresh) విమర్శించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యూ) కామారెడ్డి కమిటీ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి 30 వరకు విద్యార్థి పూర్ యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల వసూలు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తున్న, ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు లేక టీచర్ పోస్టుల ఖాళీల మూలాన విద్య వ్యవస్థ కుంటుపడుతున్నదని అన్నారు.
అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. విద్య బాగు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 7 శాతానికి మించి బడ్జెట్ కేటాయించకపోవడం మూలాన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పింది అన్నారు. వెంటనే విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేస్తూ 500 పైగా ఎంఈఓ, 28 డిఇఓ పోస్టుల ఖాళీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే విద్యాధికారులు లేకపోవడం వల్ల గురుకులాలలు, సంక్షేమ హాస్టల్లో నిత్యం విద్యార్థులు కల్తీ ఆహారంతో అస్వస్థకు గురవుతున్నారని వాపోయారు. అలాగే విద్య ప్రమాణాలు దెబ్బతింటున్నాయని అన్నారు. రాష్ట్రంలో 8000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీకాంత్ మిథున్ నరేష్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.