calender_icon.png 15 October, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యవివాహాలపై అప్రమత్తంగా ఉండాలి

15-10-2025 12:35:54 AM

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర

హన్వాడ, అక్టోబర్ 14 :  బాల్యవివాహాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి తమకు సమాచారం చేరవేస్తే అడ్డుకుంటామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, బాలల రక్షణ సంరక్షణ పై నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.  నేరాల అదుపునకు చట్టాల తో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం-2024 ప్రకారం బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కలలను సాకారం చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీసులకు 100కు ఫోన్ చేసి గాని, చైల్ లైన్ 1098కు ఫోన్ చేసి గాని వివరాలు చెబితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలలు, మహిళలకు ప్రాథమిక హక్కులను తెలియజేసేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు.

14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని సూచించారు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తయారుచేసిన కొన్ని వీడియోలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శించి అవగాహన కల్పించారు.

పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని చదువుపై శ్రద్ధ చూపేలా కౌన్సిలింగ్ ఇవ్వడం బాధ్యతగా తీసుకోవాలని టీచర్లతో నిర్వహించిన సమావేశంలో సూచించారు. తహసిల్దార్ కృష్ణా నాయక్, ఎంపీడీవో యశోదమ్మ, ఎంఈఓ గోపాల్ నాయక్, డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వర్లు,  స్కూల్ హెడ్మాస్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.