calender_icon.png 15 October, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23 వేల ఓట్లు ఎలా పెరిగాయి?

15-10-2025 01:50:58 AM

12 వేల ఓట్లు ఎందుకు తొలిగాయి!

-కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు 

-జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టును ఆశ్రయిస్తాం

-ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్‌ఎస్సే 

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు 

-బోగస్ ఓట్ల అంశంపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని, 12 వేల ఓట్లు ఎందుకు డిలీటయ్యాయో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీకి సం బంధించిన రుజువులన్నింటిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా ఇచ్చామని, 24 గంటలు దాటినా ఇప్పటిదాకా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తాము హైకోర్టుకి వెళ్తామని కేటీ ఆర్ పేర్కొన్నారు.

ఎన్ని రకాల కుట్రలు చేసినా గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బోగస్ ఓట్ల అంశంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల కమిషన్ డ్యూటీని తన చేతుల్లోకి తీసుకొని అక్రమంగా ఓటు ఐడీలను పంచారని విమర్శించారు. బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను పంచారని, అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో ముఖ్యమం త్రికి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఆయన ఫోటోలు పెట్టుకుని మరీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “43 ఓట్లు ఉన్న సంస్కృతి అపార్ట్మెంట్‌కు మేము కూడా వెళ్లి చూశాం.

అక్కడ ఉన్న ఓనర్ మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్లకు, ఉన్న ఇంటి యజమానులకు, ఈ లిస్టులో ఉన్న వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారని వివరించారు. “బూత్ నంబర్ 125లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయి. 80 గజాలు మాత్రం ఉన్న ఇంట్లో ఇంత మంది ఎలా వచ్చారో మాకు తెలవదని యజమాని చెప్పారు” అని కేటీఆర్ వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కింది స్థాయి అధికారులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అన్న అనుమానం తమకు ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్‌కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.

ఇలా దొంగ ఓట్లు, రెండు మూడు ఓటర్ ఐడీ కార్డులు, ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘానికి ఇప్పటికే అందించామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఓటుగా నమోదు అయిన సిరిసిల్ల నివాసి శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడితే తనకు సంబం ధం లేకుండానే తన ఓటును జూబ్లీహిల్స్‌లో నమోదు చేశారని, తన పేరుతో దొంగ ఓటు రాయించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

కొత్తగా వచ్చిన 23 వేల ఓట్ల పైన ఎన్నికల సంఘం సంపూర్ణ దర్యాప్తు జరపాలని, డూప్లికేట్, నకిలీ ఓట్లను తొలగించాలని, ఈ ఓట్ల నమోదుకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి దర్యాప్తు చేపట్టాలని కోరారు. తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ నేతలు నీతిమాలిన మనుషులు

మాగంటి సునీత భావోద్వేగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు నీతిమాలిన మనుషులని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీత తన కుటుంబ పెద్దను కోల్పోయిన జూబ్లీహిల్స్ లాంటి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి గురయ్యారని, అయితే, దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలడం దారుణమన్నారు. మాగంటి గోపీనాథ్ కుమార్తెపై కూడా అక్రమంగా కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ నీతిలేని రాజకీయాలకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.