15-10-2025 01:23:44 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మెడకు ఉచ్చు బిగుస్తోంది. విచార ణకు ఆయన సహకరించడం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం, సిట్ అధికారులు అడిగిన సమాచారాన్ని ఇచ్చి తీరాల్సిందేనని సోమవారం సంచలన ఆదేశాలు జారీ చేసిం ది.
ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను, మధ్యంతర రక్షణను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభు త్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఈ కీలక ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా, ఈ కేసుకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తన ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని, డేటా డిలీట్ చేశారని తేలితే కేసు డిస్మిస్ చేస్తామని హెచ్చరించింది.
ప్రభాకర్‌రావు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా చేసింది. జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుపై మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుసార్ మెహ తా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వైఖరిపై ధర్మాసనం అసహనం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, కీలక సమాచారాన్ని దాచిపెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్ నాగరత్న ధర్మాసనం, ప్రభాకర్ రావు వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రతి సమాచారాన్ని ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చి తీరాల్సిందే,అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ముఖ్యంగా, ఈ కేసుకు అత్యంత కీలకమైన క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారాన్ని విచారణ అధికారులకు వెంటనే అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా, వాటికి సంబం ధించిన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను కూడా ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఈ సమాచారాన్ని సేకరించేటప్పుడు పూర్తి పారదర్శకత పాటించాలని, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సిట్ అధికారులకు న్యాయస్థానం సూచించింది. కీలకమైన సమాచారాన్ని ప్రభాకర్ రావు నాశనం చేశారని సిట్ అధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో, ఈ క్లౌడ్ డేటా రికవరీ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది.