calender_icon.png 15 October, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్‌పై నీలినీడలు!

15-10-2025 01:48:28 AM

సన్నధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలైనా రైతులకు డబ్బులు చెల్లించని సర్కార్

-4.09 లక్షల మంది రైతులకు..రూ.1,160 కోట్ల బకాయిలు 

-వానాకాలం కోతలు ప్రారంభమైనా ఊసే ఎత్తని పాలకులుప్రభుత్వ కాలయాపనపై కర్షకుల ఆగ్రహం 

-ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వకపోవడమే సమస్య అంటున్న ప్రభుత్వవర్గాలు 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : సన్నాలకు బోనస్ ఇస్తామన్న సర్కార్ హామీపై నీలి నీడలు కమ్ముకుంటు న్నాయి. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు గడిచినా సర్కార్ ఇప్పటికీ రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో.. బోనస్‌కు మంగళం పాడి నట్లేనా అనే అనుమానాలు కలుగుతున్నా యి.  గత యాసంగిలో 4.09 లక్షల మంది రైతుల నుంచి ప్రభుత్వం మొత్తంగా (సన్నా లు, దొడ్డు రకం కలిపి) 74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. యాసంగిలో  ధాన్యం విక్రయించి దాదాపు మూడు నెలలు దాటుతోంది. ఇప్పుడు వానాకాలం పంట కోతలు ప్రారంభమైనా.. ప్రభుత్వం బోనస్ ఊసే ఎత్తకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

ఒక వైపు స్థానిక ఎన్నికలు ఉంటాయని సర్కార్ చెబుతోంది. బోనస్ డబ్బులు ఇస్తామన్న హామీ అమలు చేయకపోవడం తో ఎన్నికల్లో రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందనని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో  సన్న వరి విక్రయించిన రైతులకు  దాదాపు రూ.1,160 కోట్లు బోనస్ కింద  ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే సన్న వడ్ల బోన స్ ఇస్తుందా..? లేదా? అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత వానా కాలం (2024 సీజన్‌లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం పండించిన నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ. 1200 కోట్ల వరకు చెల్లించిన విషయం తెలిసిందే. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీతో రూ. 18 వేల కోట్లకు పైగా, రైతు భరోసా పేరుతో రూ. 9 వేల కోట్ల వరకు విడుదల చేసిన ప్రభుత్వం.. బోనస్ బకాయిలు చెల్లించకుండా ఎందుకు తాత్సారం చేస్తుందోనని చర్చ జరుగుతోంది. ఈ వానాకాలంలోనూ రాష్ట్రంలో 148.03 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.  80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని కొను గోళ్లకు  ఏర్పాట్లు చేస్తోంది. 

బోనస్ కోసం పోరు బాట

అప్పులు తెచ్చి మరీ సన్నాలు సాగు చేస్తే ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. బోనస్‌తో కలిపి లాభాలు వస్తాయనుకుంటే నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.  ప్రభుత్వ తీరుతో అసంతృప్తితో ఉన్న రైతులు బోనస్ కోసం పోరుబాట పడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియో జక వర్గంలోని కృష్ణా తీర ప్రాంత రైతులు ఇప్పటికే ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో  రైతులంతా మూకుమ్మడిగా పోటీ చేసి నిరసన తెలపాలనే ఆలోచనతో  ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, సన్న ధాన్యం బోనస్ బాకాయిలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతోనే సమస్యలు ఉత్పన్న మవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ధాన్యం బోనస్ డబ్బులే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక బిల్లులు కూడా పెండింగ్‌లో ఉంటున్నాయని, తద్వా రా సర్కార్‌కు చెడ్డ పేరు వస్తుందని అధికార పార్టీ నుంచే విమర్శలు రావడం గమనార్హం.