calender_icon.png 15 October, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లను అడ్డుకోండి!

15-10-2025 01:27:47 AM

  1. పీబీఎల్‌పీ రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధం
  2. సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ లేఖ
  3. ప్రభావిత రాష్ట్రాలు, సంస్థలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిం చిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (పీబీఎల్‌పీ) రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరు ద్ధంగా చేపడుతున్నదని, బనకచర్లను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారు దల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మహ్మద్ అమ్జ ద్ హుస్సేన్  సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్)కు లేఖ రాశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితోపాటు పలుమార్లు లేఖలు రాశారని, ఏపీ ప్రతిపాదించిన పీబీఎల్‌పీపై తెలం గాణకు అనేక అభ్యంతరాలున్న నేపథ్యంలో ఏపీ ప్రతిపాదనను పూర్తిగా అడ్డుకోవాలని లేఖలో కోరారు.

పీబీఎల్‌పీకు సంబంధించి ప్రీటీ రిపోర్టుపై అభిప్రాయాలు కోరుతూ గోదావరి బోర్డు, కృష్ణా బోర్డులతోపాటు ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 6 రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో పోలవరం-బనకచర్లపై తెలంగాణకు ఉన్న అభ్యం తరాలను మరోసారి పేర్కొంటూ, వెంటనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈఎన్సీ కోరారు.

ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి.. కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఉద్ఘాటిస్తూ.. ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరిం చేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని కోరిన విషయాన్ని కూడా తాజా లేఖలో పేర్కొన్నారు. అలాగే పీబీఎల్‌పీ విషయంలో వచ్చిన ప్రతిపాదనలను పరిగణ లోకి తీసుకోవద్దని, వచ్చే ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమి టీ) సమావేశంలో ఎలాంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను మంజూరు చేయకుండా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్నికూడా ఈ తాజా లేఖలో ఉటంకించారు.

ప్రీ రిపోర్టును పరిశీలించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పేర్కొన్న అంశాల ప్రకారం.. పీబీఎల్‌పీ ద్వారా తరలించే 200 టీఎంసీల జలాలు పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌లో పేర్కొన్నదానికి అదనమని తెలిపారు. ఇది గోదావరి ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. పీబీఎల్‌పీ అనేది తెలంగాణ జల హక్కులను పూర్తిగా హరించేదని, దీనితోపాటు పోలవరం బ్యాక్ వాటర్‌వల్ల ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం పీబీఎల్‌పీకి సంబంధించి డీపీఆర్ సిద్ధంచేయడానికి రూ.920 లక్షలకు టెండర్ నోటిఫికేషన్ జారీచేయడం, సీడబ్యూసీ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నదాని ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 484.5 టీఎంసీల నీటిని సీడబ్ల్యూసీ కేటాయించిందని, అయితే పీబీ ఎల్‌పీ చేపడితే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా మారిపోతుందని, తద్వారా సీడబ్ల్యూసీ అనుమతులను తుంగలో తొక్కినట్టవుతుందని పేర్కొంటూ.. ఈ నేపథ్యంలో పీబీ ఎల్‌పీతో సంబంధం ఉన్న రాష్ట్రాలు, సంస్థలతో అత్యవసర ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేయాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.