15-10-2025 01:57:17 AM
ముగిసిన మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం
* నాటి పీపుల్స్ వార్.. నేటి మావోయిస్టు పార్టీ వరుసగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నది. భద్రతా దళాలు ‘ఆపరేషన్ కగార్’ మొదలుపెట్టిన నాటి నుంచి పార్టీ అగ్రనేతలు మరణించడమో.. లేదా లొంగిపోవడమనేది సర్వసాధారణమైంది. ఇప్పుడు పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ లొంగుబాటు అనూహ్యమైనది. ‘తాత్కాలికంగా ఆయుధాలు పక్కనపెడతాం.
శాంతి చర్చలకు సిద్ధం’ అంటూ గత నెలలో అభయ్ పేరిట వేణుగోపాల్ విడుదల చేసిన లేఖ పార్టీలో కలకలం రేపింది. ఆ లేఖపై పార్టీ సెంట్రల్ కమిటీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పరిణామాలేమైనప్పటికీ.. వేణుగోపాల్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మంగళవారం పోలీసుల ఎదుట 60 మంది సహచర మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి లొంగిపోయారు. వారికి ఆయుధాలు సైతం అప్పగించారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగుబాటు
గడ్చిరోలి/హైదరాబాద్, అక్టోబర్ 14: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు డు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి మంగళవారం ఆయుధాలు అప్పగించి అక్కడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్‌పై అన్ని రాష్ట్రాలు కలిపి రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. వారి లొంగిబాటును ఇప్ప టికే ఆ రాష్ట్ర అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
మావోయిస్టు పార్టీకి ఈ పరిణా మం పెద్ద ఎదురుదెబ్బ. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించేందుకు బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరోమార్గం లేదంటూ వేణుగోపాల్ గత నెలలో అభ య్ పేరిట లేఖ రాయడం కలకలం రేపిం ది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని అభయ్ రాసిన లేఖను పార్టీ అగ్రనేతలు హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించారు. అందుకు ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్యే విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. 1956 మే 10వ తేదీన పెద్దపల్లిలో వేణుగోపాల్ జన్మించారు.
తల్లిదండ్రులు మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులు. వారికి కోటేశ్వరరావు, అంజన్న, వేణుగోపాల్‌రావు కుమారులు. 1977లో జగిత్యాల జైత్రయాత్ర ఒరవడిలో కోటేశ్వరరావు ఉద్య మంలోకి వచ్చారు. అన్నను ఆదర్శంగా తీసుకుని వేణుగోపాల్ కూడా ఉద్యమంలోకి ప్రవేశించారు. మరో సోదరుడు అంజన్న ఇప్పటికీ పౌరోహిత్యం చేసుకుంటున్నారు.
ఉద్యమ ప్రస్థానం..
వేణుగోపాల్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) ఆయన్ను ఆకర్షించింది. ఆ స్ఫూర్తి తో ఆయన పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో చేరారు. 1981లో ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీ సులు మల్లోజులను అరెస్టు చేశారు. 1983 లో విడుదలయ్యారు. మళ్లీ ఆయన తిరిగి దళంలోకి వెళ్లారు.
1993లో డీకేఎస్‌ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఎదిగారు. తర్వాత మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాం తంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమల్లో మావోయిస్టు పార్టీ గెరిల్లా జోన్ నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2010లో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ (అజాద్) మరణం తర్వాత వేణుగోపాల్ ఆ బాధ్యతలు తీసుకున్నారు.
పార్టీ ప్రచురణ విభాగం ఆయన కీలక బాధ్యతలు పోషించారు. ఇదే ఏడాది దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మట్టుపెట్టడం వెనుక మాస్టర్ బ్రెయిన్ వేణుగోపాల్‌దేనని ఇప్పటికీ పోలీస్‌వర్గాలు భావిస్తాయి. ప్రస్తుతం వేణుగోపాల్ వయస్సు 69 సంవత్సరాలు. ఆపరేషన్స్ వ్యూహకర్త, పార్టీ సిద్ధాంతకర్త పోలీసులకు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి సిద్ధాంతపరమైన, సైనికపరమైన, కమ్యూనికేషన్ పరంగా తీరని నష్టంగా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నా యి.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా వేణుగోపాల్ తన మార్గమే సరైందని నిరూపించుకుంటూ పోలీసుల ఎదుట లొంగిపోవడం మిగిలిన పార్టీలో క్యాడర్‌కూ హెచ్చరిక పంపినట్లయింది. వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత ఇక మావోయిస్టు పార్టీ ఉద్యమం ఏ దిశగా పయనిస్తోందనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.
అమిత్‌షా ప్రకటనతో మారిన పరిణామాలు
‘ఆపరేషన్ కగార్’పై ఈ ఏడాది జూన్ 22న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోపే భారత మావోయిస్టు విముక్త భారత్ అవతుందని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజధాని రాయపూర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కు శంకుస్థాపన చేసి ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మావోయిస్టు పార్టీతో చర్చలు ఉండవని తేల్చిచెప్పారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు.
తర్వాత కొన్నాళ్లకు ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మాడ్ అడవుల్లో జరిగిన 50 గంటల ఆపరేషన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సహా దాదాపు 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటివరకు 264 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తన లేఖ ద్వారా ఆయుధాల తాత్కాలిక విరమణ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
జీవిత భాగస్వామిగా తారక్క
వేణుగోపాల్‌కు 90వ దశకం ఆరంభంలో తారక్క పరిచయమైంది. ఆమె స్వస్థలం మహారాష్ర్టలోని గడ్చిరోలి జిల్లా. అమె అసలు పేరు సిడాం విమలచంద్ర అలియాస్ తారక్క అలియాస్ వత్సల. 1986 నుంచి ఆమె నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వేణుగోపాల్, తారక్కకు పార్టీపరమైన వివాహం జరిగింది. తారక్క సుమారు 38 ఏళ్ల పాటు పార్టీలో పనిచేశారు. సుమారు 35 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు.
ఆమె గడ్చిరోలి జిల్లా అహేరి మెంబర్‌గా, పెరిమెలి, భామ్రఘడ్ ఏరియా కమాండర్‌గా, ఏరియా కమిటీ సెక్రటరీగా, సౌత్ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలిగా పార్టీలో సేవలందించారు. ఆమె గడ్చిరోలి రీజియన్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ 2024 డిసెంబర్ ౩౧న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
ఆమెపై పలు రాష్ట్రాల్లోని పోలీస్‌స్టేషన్లలో దాదాపు 170 కేసులు ఉన్నాయి. ఆమెపై రూ.కోటికి పైగా రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఆమెతోపాటు ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారందరికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పునరావాస పథకాలు అందాయి. భార్య పోలీసుల ఎదుట లొంగిపోయినప్పటికీ వేణుగోపాల్ మాత్రం మావోయిస్టు పార్టీలోనే కొనసాగారు.
కిషన్‌జీ ఈయన సోదరుడే
2010 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌లో‘ఆపరేషన్ గ్రీన్ హంట్’కు వ్యతిరేకంగా జరిగిన ‘లాల్గర్’ ఉద్యమ నాయకుడిగా మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ వ్యవహరించారు. ఈయన 2011 నవంబర్ 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. కోటేశ్వరరావు 1970 చివరలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో, మావోయిస్టు భావజాలంతో సంబంధం ఉన్న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.
ముప్పాల లక్ష్మణరావుతో సమకాలికుడిగా ఉద్యమంలో పనిచేశారు. సుమారు 50 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1977 ప్రాంతంలో పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా ప్రహ్లాద పేరుతో కిషన్ జీ పనిచేశారు. 1977లో జగిత్యాల జైత్రయాత్రలో భాగంగా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1980 నుంచి ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉద్యమ వ్యాప్తికి కిషన్ జీ కృషి చేశారు. తర్వాత పార్టీ ఉద్యమం దండకారణ్యానికి పాకింది. అన్న కోటేశ్వరరావు స్ఫూర్తితోనే వేణుగోపాల్ పీపుల్స్‌వార్‌లో చేరారు.
అమ్మా.. నీకు వందనం!
పార్టీ కోసం అన్నను, నన్ను కన్నావు..
తల్లి మరణం సందర్భంగా వేణుగోపాల్
హృదయాలను కదిలించిన లేఖ
‘అమ్మా.. నీ అంత్యక్రియలకు రాలేనందుకు చింతిస్తున్నా.. పెద్దపల్లి పెద్దవ్వలేదని ఇప్పుడు మావోయిస్టు పార్టీ కన్నీరు పెడుతున్నది.. నీ మరణం నాకే కాదు యావత్ మావోస్టు పార్టీ కుటుంబసభ్యులకూ తీరని లోటు. నువ్వు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్‌రావుని పార్టీ కోసం కన్నావు. మా జీవితాలను ప్రజలకు అంకితం చేశావు.
అమ్మా.. అందుకు నీకు వందనం’ అంటూ తల్లి మధురమ్మ కాలం చేసినప్పుడు వేణుగోపాల్ విడుదల చేసిన లేఖ నాడు హృదయాలను కదిలించింది. మధురమ్మ 2022 నవంబర్ 2న కన్నుమూశారు. మరణించే నాటికి ఆమె వయస్సు 96 ఏళ్లు. అలాగే తండ్రి మల్లోజుల వెంకటయ్య 1997లో కన్నుమూశారు. అప్పుడు కూడా కోటేశ్వరరావు, వేణుగోపాల్‌రావు కడసారిచూపు చూసేందుకు రాలేకపోయారు.
బాబాయిని చూడాలి..
మల్లోజుల అంజన్న కుమారుడు దిలీప్ శర్మ
బాబాయి వేణుగోపాల్ అడవి బాట్టిన కొంత కాలానికి నేను పుట్టాను. ఇప్పటివరకు నేను ఒక్కసారైనా బాబాయిని చూడలేదు. పెదనాన్న కిషన్‌జీ, బాబాయి వేణుగోపాల్ ఎంతో చదువుకున్నవారు. జ్ఞానవంతులు. వారు పీడిత ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. పెద్దనాన్న ఉద్యమంలో ప్రాణాలు సైతం అర్పించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలం కాదు.
కాలంతో పాటు అందరూ మారాలి. నానమ్మ మధురమ్మ చనిపోయే ముందు ఆయన్ను చూడాలనుకున్నది. కానీ, ఆ కోరిక తీరకుండానే కన్నుమూసింది. బాబాయి లొంగుబాటును మా కుటుంబం స్వాగతిస్తుంది. బాబాయిని ఇకనైనా చూస్తామనే ఆనందం మా కుటుంబంలో ఉంది.
వేణుగోపాల్‌కు మారుపేర్లెన్నో!
వేణుగోపాల్‌కు మావోయిస్టు పార్టీలో భూపతి, సోను, మాస్టర్,
అభయ్, లచ్చన్న, రుసి అనే మారుపేర్లున్నాయి.
లేఖను తప్పుబట్టిన పార్టీ
ఈ లేఖను మావోయిస్టు పార్టీ తప్పుబట్టింది. మావోయిస్టు పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయన తనతోపాటు తన సహచరుల వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని హెచ్చరికలు జారీ చేసింది. లేదంటే పీపుల్స్ గెరిల్లా దళం ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా అభయ్‌ని ‘విప్లవ ద్రోహి‘గా ప్రకటించింది. మావోయిస్టు పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేత అభయ్ అని ఆరోపించింది. అయితే.. నార్త్ బస్తర్, గడ్చిరోలి, అబూజ్‌మడ్ వంటి కీలక ప్రాంతాల డివిజన్ కమిటీలు మాత్రం అభయ్ లేఖకు మద్దతు ప్రకటించాయి.