07-05-2025 05:39:22 PM
టీజీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ శ్రావణి...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): నీలగిరిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(Telangana Forest Development Corporation) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని "నీలగిరితో నా స్నేహం" పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో బుధవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ శ్రావణి మాట్లాడుతూ... నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యే కలప లభ్యమవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు.
ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు, ఆ తర్వాత కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దుర్గం నరేష్, వాచర్లు మొండి, సత్తయ్య, రవి సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు.