17-07-2025 01:15:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 16(విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ప్రయోజనాలను అందించడంలో యూడిఐడి కార్డు ఎంతగానో దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు యూడిఐడి కార్డు మంజూరీ క్యాంపును బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు గడిచిన నెల రోజుల్లో 300 మంది దివ్యాంగులకు యూడిఐడి సర్టిఫికెట్స్ జారీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగుల అభ్యర్థన మేరకు మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు జాతీయ డేటాబేస్ను రూపొందించడానికి, ప్రతి వ్యక్తికి ప్రత్యేక వికలాంగుల గుర్తింపు కార్డును జారీ చేయడానికి వికలాంగుల కోసం ప్రత్యేక ఐడీ ప్రాజెక్ట్‌అమలు చేయబడుతుందని, ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు.
స్లాట్ బుక్ చేసుకుని 150 మంది మిగిలి ఉన్నారని తెలిపారు. 21 రోజుల్లో స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేసి దివ్యాంగులకు కార్డులు మంజూరు చేస్తామన్నారు. బుధవారం స్లాట్ బుక్ చేసుకున్న 85 మందికి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షించి పోర్టల్ లో డేటా ఎంట్రీ చేసి యుడిఐడీ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.ఈ డాక్టర్ సునీత, డాక్టర్ శివదయాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.