15-10-2025 01:14:20 AM
కురుమిద్దకు చెందిన మూలీ కృష్ణ కు పురస్కారం పట్ల సర్వత్రా హర్షం
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ర్ట డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందిన మూలీ కృష్ణ కు మంగళవారం ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన రంగారెడ్ది జిల్లా యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందిన మూలి కృష్ణ చిన్న వయసులోనే పోలీస్ హోంగార్డు వృత్తిలో చేరి శాంతి భద్రతల పర్యవేక్షణలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు సేవలు అందించారు.
వృత్తిని ఆరాధ్య దైవంగా భావించిన మూలి కృష్ణ విధుల్లో ఉత్తమ సేవలను గుర్తించిన ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్కృష్ట పథకం ఉత్తమ సేవా పురస్కారం అందజేసింది. ప్రజలకు సేవలందిస్తున్న యావత్ పొలీస్ లోకానికి హోంగార్డు మూలి కృష్ణ స్వీకరించిన అవార్డు ఆదర్శం కాగలదని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో విధుల్లో చాకచక్యంగా వ్యవహరించినందున ఈ పురస్కారం లభించిందని తెలిపారు.
నిరుపేద కుటుంబంలో జన్మించి వృత్తిలో ప్రతిభ కనబరుస్తూ, సుదీర్ఘ కాలంగా హోంగార్డుగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ అందరికీ కృష్ణ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం తన వృత్తి సేవలను గుర్తించి అందించిన పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని మూలి కృష్ణ చెప్పారు. విధుల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు. రాష్ర్ట డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం తాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఉత్కృష్ట పథకం అందిస్తున్నందుకు పోలీస్ శాఖ ఉన్నత అధికారులకు కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.