calender_icon.png 10 February, 2026 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మించి మోసం

10-02-2026 01:49:36 AM

  1. సీఎం రేవంత్‌ను నమ్మి నష్టపోయారు 
  2. కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ 
  3. అడ్రస్ లేని ఆరు గ్యారెంటీలు 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  5. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం 

మహబూబాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోసగించారని, ఇప్పు డు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే 6 గ్యారంటీలు అమలు చేస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీల బాండ్ పేపరు రాసి చ్చి వాటిని అమలు చేయలేక విఫలమయ్యారని, ము న్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకుల చొక్కా పట్టుకొని ప్రశ్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో సోమవారం కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ యా చోట్ల ఏర్పాటు చేసిన రోడ్ షోలలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిట్టడమే తప్పా చేసిందేమీ లేదన్నారు. హామీల అమలు పక్కనబెట్టి కుంభకోణాలకు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజల సంక్షేమం కొరవడిందని, రేవంత్‌రెడ్డిని నమ్మిన ప్రజలను నట్టేట ముంచారన్నారు. అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిన చందంగా మార్పు మార్పు అన్న ప్రజలను ఈరోజు కాంగ్రెస్ ఆగం చేసిందన్నారు.

ఏ హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలని కాంగ్రెస్ నేతలను ఆడబిడ్డలు నిలదీయాలన్నారు. 4000 రూపాయల పింఛను, తులం బంగారం వచ్చిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దూర దృష్టితో మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు డివిజన్లను ఏర్పాటు చేసి కలెక్టర్ కార్యాలయా లు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, నూతనభవనాల నిర్మాణం, అభి వృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని కేటీఆర్ అన్నారు.

గత ప్రభుత్వం నిర్మించిన నూతన భవనాలకు రంగులేసి, శిలాఫలకాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని పులిని చూసినక్కలు వాతపెట్టుకున్న చందంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర రమణారెడ్డి, నరేందర్, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, నాయకులు పాల్గొన్నారు. 


2 లక్షలు ఇస్తా.. కిరాణా షాప్ పెట్టుకో

  • బీఆర్‌ఎస్ వీరాభిమానికి కేటీఆర్ హామీ 

మహబూబాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పరకాల నుంచి మహబూబాబాద్ పర్యటనకు వెళ్తుండగా మార్గ మధ్యంలో గూడూరు మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక చాయ్ హోటల్ వద్ద ఆగాడు.

కేటీఆర్ చాయ్ తాగుతుండగా తీగలవేణి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన బీఆర్‌ఎస్ వీరాభిమాని ధరావత్ వినోద్ కేటీఆర్‌ను కలిసి ఉపాధి చూపాలని అడిగాడు. కేటీఆర్ చలించిపోయి రూ.2లక్షలు ఇస్తా. కిరాణా షాప్ పెట్టుకోమన్నాడు. షాప్ ఓపెనింగ్‌కు తనను తప్పకుండా పిలవాలని కోరాడు. ఈ సహాయం మరువలేనిది అంటూ వినోద్ కృతజ్ఞతలు తెలిపాడు.