21 August, 2026 | 12:48 AM

వృద్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి

21-08-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

చౌటుప్పల్, ఆగస్టు 20 : వృద్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి ఆరోగ్యం, మానసిక ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుబంధంతో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి యాదాద్రి సేవాశ్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఎంతమంది వృద్ధులు ఉంటున్నారు, వారికి కల్పిస్తున్న వసతులు, ప్రతిరోజూ అందిస్తున్న భోజన సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయించడం, క్యారమ్స్తో పాటు వివిధ ఆటలు ఆడించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, సాయి సేవాశ్రమం నిర్వాహకులు అశోక్ పాల్గొన్నారు.