calender_icon.png 5 January, 2026 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యాలయాలలో ఉద్యోగులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలి

03-01-2026 12:00:00 AM

ప్రభుత్వ కార్యాలయాల మరమ్మత్తులు, సౌకర్యాలపై 

ప్రతిపాదనలు సమర్పించాలి: -జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, జనవరి 2 (విజయక్రాంతి):  ప్రజా సేవలలో నాణ్యత పెంచే దిశగా ప్రభుత్వ కార్యాలయ మరమ్మత్తులు, మౌళిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సందర్శించారు. బస్ డిపో రోడ్లోని డిఆర్డీఎ భవనం, ఆర్ & బీ ఇంజనీరింగ్ కార్యాలయం, బాల రక్షా భవనం, గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్తో పాటు పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బందితో కలెక్టర్ నేరుగా మాట్లాడి మౌళిక వసతులు, పని వాతావరణం, సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ భవనాల స్థితిగతులు, మరమ్మత్తుల అవసరం, విద్యుత్, నీటి సౌకర్యాలు, పారిశుధ్యం, ఫర్నిచర్ వంటి అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి  కార్యాలయంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాల మరమ్మత్తులు, అవసరమైన మౌళిక వసతుల కల్పనపై శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి తక్షణమే సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్ల ప్రస్తుత పరిస్థితులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగులకు అనుకూలమైన కార్యాలయ వాతావరణం ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.