05-01-2026 04:00:52 PM
అఖిలపక్షం ఆందోళన ఉదృతం
అధికారుల నిలదీత ..రోడ్డుపై ధర్నా
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధపడుతున్న వేళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయంటూ స్థానిక అఖిలపక్షం నాయకులు ఆందోళన ఉధృతం చేశారు. అధికారులు ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్ లిస్టు ప్రదర్శించినప్పటి నుంచి స్థానికంగా ఓటర్ లిస్టులో గందరగోళం, అవకతవకలు ఉన్నాయంటూ పలువురు పార్టీలు నాయకులు ఆందోళన ,నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సోమవారం అఖిలపక్షం పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఓకే కుటుంబం ఓట్లు నాలుగు వార్డులలో నమోదు, దాంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గ్రామపంచాయతీ ఓటర్లు ప్రస్తుతం మున్సిపాలిటీలో కూడా నమోదైనట్లు ఆరోపించారు. ఆధార్ కార్డుకు, ఇంటి నెంబర్ కు పొంతన లేకుండా పలు ఓట్లు నమోదు అయినట్లు నాయకులు ఆరోపించారు. ఓటర్ లిస్టు సవరించి కాలనీలా హద్దులు ఏర్పాటు చేయాలని గతంలో గ్రామపంచాయతీ గా ఉన్నప్పుడు 18 వార్డులు కాగా ప్రస్తుతం మున్సిపాలిటీలో 12 వార్డులు చేయడంతో ఇంటి నెంబర్ ప్రకారం ఓట్లు ఏ వార్డులోకి వస్తాయో అధికారులు నిర్ధారించాల్సి ఉండగా అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో ఓటర్లు గందరగోళం అయి ఏ బూతులో ఓటు వేయాలో తెలియక సతమతమయ్యే అవకాశం ఉందని, దాంతోపాటు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పట్టణంలోని 12 వార్డుల కుటుంబాలు ఉంటాయని వారు ఏ వైపు ఓటు వేయాలో అర్థం కాక కాలనీ అభివృద్ధి కోసం 12 మంది కౌన్సిలర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని, అలా కాకుండా ప్రత్యేకంగా ఒక వార్డు కేటాయించాలని అలా చేయక పోవడం అధికారుల నిర్లక్ష్యమని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో నాయకులు అధికారుల సమాధానంతో తృప్తి చెందక పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద నిరసన రాస్తారోకో చేపట్టారు. వెంటనే ఓటర్ లిస్టులో సవరణలు చేయకపోతే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తూ, లేని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని భీష్మించుకున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ కల్పించుకొని ఖచ్చితంగా లిస్టులు సవరిస్తామని తప్పులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సర్ది చెప్పారు .కాగా నాయకులు కలెక్టర్ రావాలని నాయకులు పట్టు పట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు అంకం మహేందర్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కొండాడి గంగారావు, నంది రామయ్య, నాయిని సంతోష్, ఎనగందుల నారాయణ ,తదితరులు ఉన్నారు.
ఓటర్ లిస్టు సరి చేయాలి లేదంటే ఆందోళన ఉధృతం... ఎంపీ నగేష్ ,బాజప జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్
ఖానాపూర్ లో అఖిలపక్షం నాయకులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఆందోళన స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే ఓటర్ లిస్టు అవకతవకలు సరిచేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ రాకముందే సవరించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని ఎంపీ ఆదేశించారు.