25-07-2024 12:54:09 PM
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.. లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది తమ సంకల్పం అన్న భట్టి విక్రమార్క త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల అందిస్తామన్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నామని, మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.16,410 కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు సమీకరిస్తున్నామన్నారు. త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.