23-10-2025 05:20:04 PM
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్..
కల్వకుర్తి: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్చించారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కార స్థితి, కారణాలను ఆర్డీవో జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు, దేవాదాయ భూముల వివరాల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డుల్లో లోపాలు లేకుండా ఉండాలని, భూస్వాముల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, వివాదాస్పద భూముల రికార్డులు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని, ఏదైనా గందరగోళం లేదా అస్పష్టత ఉంటే వెంటనే దానిని సరిచేయాలని సూచించారు.
రెవెన్యూ సిబ్బంది, ఆర్డీవో, తహసీల్దార్లు, విఆర్వోలు అందరూ భూభారతి చట్టంలోని ప్రతీ మాడ్యూల్‌పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు లేదా పౌరులు సమర్పించిన భూమి సంబంధిత దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. భూ భారతి చట్టం ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశ్యం ప్రజల భూమి సమస్యలను వేగంగా, న్యాయంగా పరిష్కరించడం అని గుర్తు చేశారు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి భూమి సంబంధిత అర్జీలు స్వీకరించి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తోందని చెప్పారు. భూమి వివాదాలు లేకుండా జిల్లా రికార్డులు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు.