23-10-2025 05:22:53 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి..
కల్వకుర్తి: జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయని వాటిని అధిగమించి లక్ష్యం వైపు అడుగులు వేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి కల్వకుర్తి పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు గౌరవం తెచ్చిపెట్టాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తే లక్ష రూపాయల చొప్పున బహుమతి అందజేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించి మెరుగైన విద్యానందించేందుకు కృషి చేస్తున్నామని పిల్లల భవిష్యత్తు పట్ల అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలనీ అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వంట సిబ్బంది బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసి సిద్ధం చేయాలని, వంట గది పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్టోర్ రూమ్, కూరగాయల నిల్వ గదులను పరిశీలించి అవి కూడా చక్కగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా విద్యపై దృష్టి పెట్టాలని, కష్టాలు వచ్చినా చదువును పక్కన పెట్టవద్దన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు బోధన పద్ధతులు అవలంబించాలన్నారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని అర్థం చేసుకొని ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నందున వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని నాణ్యమైన విద్యను అందించాలని సమస్యలు వస్తే తమ దృష్టికి తేవాలని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని యాదమ్మ, తహసిల్దార్ ఇబ్రహీం, పాఠశాల ప్రిన్సిపల్ వీరభద్రం, హాస్టల్ వార్డెన్ కృష్ణవేణి తదితరులు ఉన్నారు.