23-10-2025 04:53:39 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం నాడు పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఓపెన్ హౌస్ ద్వారా విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా, డాగ్ స్క్వాడ్ ఆయుధాలు, అన్ని రకాల తుపాకులు, అల్లర్ల నియంత్రణకు వినియోగించే స్మోక్ గన్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం యొక్క పని విధానాన్ని వివరించారు.
అలాగే, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, పోలీసులు వినియోగించే కమాండ్ కంట్రోల్ వాహనం, అల్లరిమూకలను చెదరగొట్టేందుకు వినియోగించే స్మోక్ షెల్స్ ను పేల్చేందుకు వీలుగా వుండే వజ్ర వాహనంతో పాటు ప్రదర్శనలో షీ టీం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు వాటి గురించి పూర్తి వివరాలు అందించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేరం జరిగినట్లయితే వెంటనే ఫిర్యాదు చేసే విధానాలు తెలిపే స్టాల్‌ను విద్యార్థులు ఆసక్తిగా సందర్శించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమీషనర్ శ్రీ గౌష్ ఆలం తెలిపారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఈ పోటీలలో మరియు కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.