15-10-2025 01:41:06 AM
-హరిరాం, మురళీధర్, శ్రీధర్‌ల రూ.400 కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలోకి
-కేసు తేలేంత వరకు క్రయవిక్రయాలు బంద్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఇంజనీర్లకు విజిలెన్స్ వింగ్ భారీ షాకిచ్చింది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పట్టుబడిన మాజీ ఈఎన్‌సీలు హరిరాం, మురళీధర్, ఈఈ నూనె శ్రీధర్‌లకు చెందిన భారీ ఆస్తులను విజిలెన్స్ శాఖ నిషేధిత జాబితాలో చేర్చింది. బహిరంగ మార్కెట్‌లో ఈ ముగ్గురి ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడి భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ ఏడాది ముగ్గురు ఇంజనీర్ల ఇళ్లు, వారి బంధువుల నివాసాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే, కేసు విచారణలో ఉండగానే వారు తమ ఆస్తులను ఇతరులకు బద లాయించడం లేదా విక్రయించడం వంటివి చేయకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కోర్టులో కేసు తుది తీర్పు వెలువడే వరకు వారి ఆస్తులకు సంబంధించి ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా, వాటిని విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ చర్యతో, కేసు తేలేంత వరకు వారు తమ ఆస్తులను అమ్మడంగానీ, ఇతరుల పేర్ల మీదకు మార్చడం గానీ సాధ్యం కాదు.
హరిరాం కీలకపాత్ర
ప్రాణహిత ఆ తర్వాత రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్‌గా కీలక పాత్ర పోషించిన భూక్యా హరి రాంను ఏసీబీ ఈ ఏడాది మే నెలలో అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన గజ్వేల్ ఈఎన్‌సీగా, ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్నారు. అరెస్టు అనంతరం ప్రభు త్వం ఆయనను సస్పెండ్ చేసింది.
రిటైరయ్యాక చిక్కిన మురళీధర్
నీటిపారుదల శాఖ ఇంజినీర్ -ఇన్ -చీఫ్‌గా పనిచేసి రిటైర్ అయిన చీటి మురళీధర్‌పై ఈ ఏడాది జూలైలో ఏసీబీ దాడులు చేసి, అక్ర మాస్తుల కేసులో అరెస్టు చేసింది. ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కో ట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
ఏఈఈ నుంచి వందల కోట్లకు నూనె శ్రీధర్
నీటిపారుదల శాఖలో ఏఈఈగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నూనె శ్రీధర్.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఈ స్థాయికి ఎదిగి, అక్రమాలకు పాల్పడి వందల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. జూన్‌లో అరెస్టయ్యే నాటికి ఆయన ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో శ్రీధర్, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట రూ.110 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.