15-10-2025 01:43:26 AM
నల్లగొండ, అక్టోబర్ 1౪ (విజయక్రాంతి) : ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతాంగానికి ఏండ్ల తరబడి ఆక్రందనే మిగులుతోంది. విత్తనపు వడ్లు కొనడం దగ్గరి నుంచి అంగట్ల ధాన్యం అమ్ముకునే వరకు నిలువెల్లా దోపిడీకి గురవుతున్నాడు. ఇంతటి ఆధునిక యుగంలోనూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోకుండా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వం పూటకో మాట చెబుతూ పబ్బం గడుపుతోంది.
రైతాంగం విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాల్సిన రాష్ర్ట ప్రభుత్వం ఎవ్వరి ఒత్తిడికో తలొగ్గాల్సి రావడం గమనారమే. అసలే గత సీజన్లలో కురిసిన అకాల వర్షాలకు రైతాంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.
అయినా ధైర్యం చేసి ఖరీఫ్ సీజనులో పెట్టుబడికి అప్పు చేసి మరి వరి పంటను సాగు చేశారు. ఎవరో పగబట్టినట్టు తెగుళ్ల బారినపడి ధాన్యం దిగుబడులు తగ్గాయి. చేతికొచ్చిన కాస్తోకూస్తో పంటను అమ్ముకుందామంటే.. కొనుగోలు కేంద్రాల్లేక అవస్థలు పడాల్సి వస్తోంది.
జాడలేని కొనుగోలు కేంద్రాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణ పరివాహాక ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరినాట్లు ముందస్తుగా వేశారు. అందుకు సంబంధించి ఇప్పటికే రైతులు వరి కోతలు ప్రారంభించి పది పదిహేను రోజులవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోక.. పంట కల్లాలు లేక రోడ్లపైనే రైతులు ధాన్యం ఆరబోస్తున్నారు.
ఈ ఖరీఫ్ సీజనులో నల్లగొండ జిల్లాలో 295 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 80 కేంద్రాల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఓపెన్ చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క గింజ కొనుగోలు చేసిన దాఖాలాల్లేవ్.
పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ.. కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం గమనారం. మరో వైపు రైతాంగం వడ్లను అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తోంది.
దళారుల చేతిలో దగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వడ్లు రైతుల చేతికొచ్చాయి. కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో రైతాంగం ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో పాలుపోవడం లేదు. అధికారులు చెప్పారని 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేందుకు వడ్లను ఎండబోసుకుంటున్నారు. అయినా కొనుగోలు కేంద్రాల జాడ కన్పించడం లేదు. దీంతో రైతాంగం చేష్టలూడిగి అడ్డికి పావుసేరు అన్న చందంగా దళారులకే అమ్ముకోవాల్సి వస్తుంది.
ఇదే అదునుగా భావించిన దళారులు రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ధాన్యం తూకంలో రైతులను దళారీ మోసం చేసిన ఘటనలు ఆడపాదడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గ్రామాల్లో పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో దళారులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది.
వణికిస్తున్న వరుణుడు..
ఓవైపు వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు వరుణుడు పిలిస్తే పలుకుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు వరద నీటికి కొట్టుకుపోయాయి. కోతకు వచ్చిన వరిపొలాలు సైతం నేలబారాయి.
ఇప్పటికే తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసిన ధాన్యం కుప్పలపై కప్పేందుకు టార్ఫాలిన్ పట్టాల్లేక వర్షార్పణం అయ్యింది. అయితే జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గంలో మొదటగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం.. కనీస వసతులు కల్పించడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారు.