24-11-2025 10:15:56 PM
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
* భౌరాపూర్ చెంచు పెంటలో బిర్సాముండా జయంతి వేడుకలు
* పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు, చెంచులతో ముఖాముఖీ
అచ్చంపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం, వారి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని బౌరాపూర్ చెంచు పెంటలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన పర్యటించారు. చెంచు ఆరాధ్యదైవం భగవాన్ బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చెంచులను ఉద్ధేశించి మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిర్సాముండా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోనూ జన జాతీయ గౌరవదివాసుగా వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశ ప్రథమ పౌరురాలు ఒక ఆదివాసీని అన్నారు. ఆదివాసైన ద్రౌవపదిముర్మును రాష్ర్టపతిగా నియమించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు.
కొమరాంభీమ్, సేవాలాల్, రాంజీ గోండు సమాజం కోసం త్యాగం చేశారని తెలిపారు. దేశాన్ని త్యాగం చేసేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదన్నారు. ఝార్ఖాండ్ చెందిన బిర్సాముండా దేశం కోసం ప్రాణాలు ఒదిలారని కొనియాడారు. వారి పోరాటాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బిర్సాముండా మంచి పోరాట యోధుడని కొనియాడారు. ఆయన్ను ప్రతీ ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు. చెంచుల సంస్కృతిని కాపాడటం మనందరి బాధ్యతని అన్నారు. ఆదివాసీల కోసం కేంద్రం ఇళ్లను నిర్మంచి ఇస్తుందని.. అందులో భాగంగానే పలువురు ఆ ఫలాలను పొందారని చెప్పారు. మరికొంత మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. అభయారణ్యంలోని చెంచులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు చెంచులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు చెంచు యువకులు పార్టీలో చేరారు. అంతకుముందు చెంచు పెంటకు చేరుకున్న బీజేపీ నేతలకు ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యాలు, విల్లంబులతో స్వాగతం పలికారు.
* చెంచుల రక్తంలో విల్లంబుల కళ
నల్లమల అభయారణ్యంలోని చెంచుల రక్తంలోనే విల్లంబుకళ ఉందని మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు కొనియాడారు. వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రాంతంలో అర్చరీ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షున్ని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరెందర్ రావు, మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ రాములు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు భరత్ ప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.