calender_icon.png 24 November, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ రాజకీయాల్లో వాడి వేడి

24-11-2025 08:48:45 PM

బీఆర్ఎస్ దళిత నేతలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నం..

అడ్డుకున్న పోలీసులు..

హనుమకొండ (విజయక్రాంతి): డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ దళిత నేతలు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, యువ నాయకుడు కంజర్ల మనోజ్, బొట్ల చక్రిల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. హనుమకొండ అమరవీరుల స్థూపం నుంచి, కాళోజి జంక్షన్, ఏకశిలా పార్కు గుండా ర్యాలీగా వెళ్తూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, శ్యామ్, సురేష్, అనిల్ కుమార్, మనోజ్, చక్రి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.   

నేనన్నదాంట్లో తప్పేముంది

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచోడు, కానీ చెడ్డ పార్టీలో ఉన్నాడని, గతంలో మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య రాసలీలల పేరుతో కోకొల్లలుగా వార్త కథనాలు పత్రికల్లో, మీడియాలో వచ్చాయని అనడంలో తప్పేంటి అని, ఇది నిజం కాదా అన్నారు.. వారిని అలా అన్నందుకు నేనెందుకు క్షమాపణ చెప్పాలి, నేను మళ్లీ అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు.. దోపిడీ చేశారు.. ఆది ముమ్మాటికి నిజమని, నన్ను అంటేనే నేను మాట్లాడాలని అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న దళిత సోదరులు ఆలోచించాలని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులను దగ్గరకు రానివ్వలేదు, ఇప్పుడు కులాల కార్డులతో వారిని వాడుకుంటున్నారన్నారు. గతంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు గాని తన చుట్టూ ఉన్నది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని అన్నారు.