calender_icon.png 17 October, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరు వాడా కదలాలి

17-10-2025 01:13:14 AM

రేపటి బంద్‌తో ఢిల్లీ పీఠాలు కదలాలి

  1. అఖిలపక్ష బీసీ నేతల పిలుపు 
  2. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం 
  3. పోలీసులు ముందస్తు అరెస్టులు చేయొద్దు.. ఆర్టీసీ బస్సులు తిప్పొద్దు
  4. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం సమావేశంలో నేతల ఏకగ్రీవ నిర్ణయం

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి):  ‘బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 18న జరిగే తెలంగాణ బంద్‌లో  పల్లె, పట్నం తేడా లేకుండా ఊరువాడా కదలాలి.. వార్డు మెంబర్ నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని, మన సెగ ఢిల్లీ పీఠాలను తాకేలా చేయాలి’ అని అఖిలపక్ష బీసీ నేతలు, బీసీ జేఏసీ నాయకులు  పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ బంద్ చరిత్రాత్మక విజయం చేయాలని వారు కోరారు.

గురువారం బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో, బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో  బంద్‌కు మద్దతుగా కీలక సమావేశం నిర్వహించారు.  ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, వి. హనుమంతరావు, బీజేపీ నేత తల్లోజు ఆచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రిజర్వేషన్లు సాధించలేం. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ పోరాటాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. బంద్ శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీజీపీ జోక్యం చేసుకుని, బంద్ ముందు ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయకుండా, శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశాన్ని కల్పించాలని, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించి 18న బస్సులను డిపోలకే పరిమితం చేసి సహకరించాలని కోరారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసి బీసీల ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.  కేవలం ఆసుపత్రులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వారు స్పష్టం చేశారు. బంద్‌లో భాగంగా బీసీల ఐక్యతను చాటేలా కులవృత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. 

సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సూరి యాదయ్య గౌడ్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్, జేఏసీ కో-చైర్మన్లు రాజారాం యాదవ్, దాసు సురేష్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మా పాల్గొన్నారు.