calender_icon.png 17 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయం

17-10-2025 01:10:10 AM

  1. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్టే..
  2. రాష్ట్రాన్ని పాలిస్తోంది కాంగ్రెస్ కాదు.. మజ్లిస్
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ర్ట రాజకీయాల్లో కచ్చితంగా మార్పు తీసుకురాబోతోందని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది రాష్ర్ట రాజకీయాలను మార్చే ఎన్నిక అని తెలిపారు. గురువారం ఎర్రగడ్డ డివిజన్‌లో పార్టీ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే వారి ఏకైక లక్ష్యం బీజేపీని అడ్డుకోవడమే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే అది పరోక్షంగా మజ్లిస్ పార్టీకి వేసినట్లేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తోంది కాంగ్రెస్ కాదు, మజ్లిస్ పార్టీ. నాడు కేసీఆర్ మజ్లిస్‌ను భుజాలపై మోస్తే, నేడు కాంగ్రెస్ అదే చేస్తోంది అని విమర్శించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, చెత్తాచెదారం పేరుకుపోయిందని, కనీసం ముఖ్యమంత్రి తిరిగే దారిలో కూడా వీధిదీపాలు లేవని ఆయన మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి?

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి అధికార కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు రూ. 12 లక్షలు, బీసీల సంక్షేమానికి లక్ష కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ఆయన నిలదీశారు. ఇచ్చిన హామీలపై యువత, మహిళలు కాంగ్రెస్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదు, ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్టే అని తెలిపారు.

జూబ్లీహిల్స్‌ను పరోక్షంగా ఏలాలని మజ్లిస్ చూస్తోందని, ఆ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలని ఓటర్లను కోరారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ప్రజల మధ్య ఉండే నాయకుడని, ఆయన గెలుపు కోసం కార్యకర్తలందరూ నవంబర్ 11 వరకు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.