calender_icon.png 12 August, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలస్తీనా ర్యాలీపై బీజేపీ ఆగ్రహం

12-08-2025 12:00:00 AM

-జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.. -చర్యలు తీసుకోవాలని డిమాండ్

-మత రాజకీయాలకు చివరి హెచ్చరిక-..

-బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు

ఖమ్మం, ఆగస్టు 11(విజయ క్రాంతి): పాలస్తీనా సంఘీభావం పేరుతో ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీపై బీజేపీ ఘాటుగా స్పందించింది. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో భాజపా నేతలు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు సమర్పించారు. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులను అనుమతి లేకుండా పాల్గొనిపించడం, జాతీయ జెండాతో పాటు విదేశీ జెండాలను ఊపించడం, మతపరమైన భావజాలాన్ని పిల్లల మదిలో నింపే ప్రయత్నం చేయడం దేశ హితానికి విరుద్ధమని, నిర్వాహకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కలెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో, ఇటీవల జరిగిన ర్యాలీకి సంబంధించిన అన్ని సంఘటనలను బీజేపీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, మానవత్వం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడటాన్ని ఖమ్మం ప్రజలు ఇక సహించబోరని హెచ్చరించారు. గాజా కోసం, పాలస్తీనా కోసం మీరు రోడ్లపై వేల ర్యాలీలు చేస్తారని, కానీ ఖమ్మం ప్రజల బాధలకు మాత్రం ఎప్పుడూ మౌనం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అనంతరం ఖమ్మం నగర ఎసిపి రమణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో గంటేల విద్యాసాగర్, సన్నీ ఉదయ ప్రతాప్, దేవకి వాసుదేవరావు, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య, మందడపు సుబ్బారావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, మందా సరస్వతి, గుత్తా వెంకటేశ్వర్లు,ఆర్ వి ఎస్ యాదవ్, ఈదుల భద్రం , వేల్పుల సుధాకర్, రజినీ రెడ్డి, శ్రీరామనేనిమణి, పాల్గొన్నారు.