11-10-2025 12:46:59 AM
వికారాబాద్, అక్టోబర్ -10: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు టి. సదానంద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బిజెపి వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్ గౌడ్ అధ్యక్షతన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథి గా హాజరైన ఆయన మాట్లాడుతూ, బిజెపి పార్టీ గతంలో కంటే ఇప్పుడు చాలా బలపడిందన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలిచినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫలాలు సామాన్యులకు అందుతున్నాయని పేర్కొన్నారు. హై కోర్టు స్టే ముగిసిన వెంటనే రాష్ర్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని, గ్రామీణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.
బిసిల రిజర్వేషన్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షులు సురేందర్, సూర్యప్రకాష్ ప్రశాంత్, రఘు, మోహన్ రెడ్డి, గొడుగు సుధాకర్, శ్రీకాంత్, అశోక్ , ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.