calender_icon.png 11 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాకోరులపై ఉక్కుపాదం

11-10-2025 12:48:11 AM

  1. రూ.1,100 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి కలిగించిన హైడ్రా
  2. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 12.5 ఎకరాలు స్వాధీనం
  3. వేటకుక్కలు, బౌన్సర్లతో బీభత్సం సృష్టించిన బంజారాహిల్స్ కబ్జాదారుడి ఆటకట్టు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి)/అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న  హైడ్రా శుక్రవారం కబ్జాకోరులపై సింహస్వప్నంలా విరుచుకుపడింది. ఒకేరో జు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో మెరుపుదాడులు నిర్వహించి, దాదాపు 12.50 ఎక రాల భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల భూమి స్వాధీనం

అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, సర్వే నంబర్ 403లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 750 కోట్లు ఉంటుంది. పార్థసారథి అనే వ్యక్తి, అసలు ఉనికిలోనే లేని నకిలీ సర్వే నంబర్ 403/52, అన్‌రిజిస్టర్డ్ సేల్ డీడ్‌ను సృష్టించి ఈ భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

ఈ భూమిలో 1.20 ఎకరాలను ప్రభుత్వం జలమండలికి కేటాయించినా, అక్కడ పనులు చేయకుండా కబ్జాదారుడు అడ్డుకుంటున్నాడని మరో ఫిర్యాదు అందింది. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన హైడ్రా బృందం, అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం ఆక్రమణలను కూల్చివేసింది. అయితే కబ్జాదారుడు పార్థసారథి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లను, వేటకుక్కలను కాపలాగా ఉంచి స్థానికులను, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.

అతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. కోర్టులో వివాదం నడుస్తుండగానే, భూమిలో అక్రమంగా షెడ్లు వేసి, మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడు. షేక్‌పేట రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఫెన్సింగ్తో పాటు లోపలున్న షెడ్లను నేలమట్టం చేశారు. అనంతరం 5 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

శివార్లలోనూ కబ్జాలపై వేటు

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం, మహాదేవపురంలో పార్కు కోసం కేటాయించిన 3.50 ఎకరాల స్థలంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అలాగే మేడ్చల్ గ్రామంలోని ఏజీ ఆఫీస్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో పార్కులు, రోడ్ల కోసం కేటాయించిన 3 ఎకరాల భూమిని కూడా కబ్జాదారుల నుంచి విడిపించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం శ్రీలక్ష్మి గణపతి కాలనీలో పార్కు కోసం కేటాయించిన 680 గజాల స్థలాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కాపాడింది. ఆక్రమణలను తొలగించి, స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.