calender_icon.png 22 November, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రామరాజ్యం పేరుతో బీజేపీ రాక్షస పాలన

22-11-2025 07:05:13 PM

మతం పేరుతో ప్రజల మధ్య విభజన రేఖ

పోలవరంతో భద్రాద్రి ఉనికికే ప్రమాదం

సిపిఐ నాయకులు చాడా, తక్కెళ్లపల్లి, బాలనర్సింహా, కలివేన, నెల్లికంటి, సాబీర్ పాషా

భద్రాచలంలో ముగిసిన ప్రచారజాత

భద్రాచలం (విజయక్రాంతి): రామరాజ్యం పేరుతో బీజేపీ దేశంలో రాక్షస పాలన సాగిస్తూ మతం పేరుతో ప్రజల మధ్య విభజన రేఖను గీసి కాషాయం పార్టీ పైశాచిక ఆనందాన్ని పొందుతుందని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతవసంత ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా జోడోఘాట్లో కోమరం భీమ్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం ప్రారంభమైన ప్రచార జాత 12 జిల్లాల మీదుగా 35 నియోజకవర్గాల పరిధిలో కొనసాగి శనివారం భద్రాచలంలో ముగిసింది. ప్రచారజాత బృంధం భద్రాచలం గోదావరి బ్రిడ్డీ సమీపానికి రాగానే సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వూల మాలలు వేశారు. అనంతరం పట్టణ పురవీధుల్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ సాగింది. అంబేద్కర్ విగ్రహంతో పాటు విప్లవ వీరుల విగ్రహాలకు వూల మాలలు వేసిన నాయకులు జోహార్లు అర్పించారు.

ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లె నర్సింహా ఆటాపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జాతా ముగింపు సభలో చాడా వెంకటరెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్రంలోని మోడి సర్కార్ కులాలు, మతాలపేరుతో దేశంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అమలు వర్చాల్సిన పాలకులు హిందుత్వ ఎజెండాను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో కోట్లాది రూపాయలు వెచ్చించి రామమందిరాన్ని నిర్మించిన నరేంద్రమోడి ప్రభుత్వం భద్రాచలం రామాలయాన్ని విస్మరించారన్నారు.

పోలవరం ప్రాజెక్టు వూర్తయితే భద్రాచలం రామాలయం నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారని, ఈ విషయంపై దృష్టి సారించకునండా చోద్యం చూడటం సరైంది కాదని హితవు పలికారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపిలో కలిపిన ఐదు గ్రామపంచాయితీలను తెలంగాణలో విలీనం చేయాలని, గోదావరి కరకట్టలను పటిష్ట పరిచి వరదభారి నుండి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలని అన్నారు. ప్రశ్నించే వారిని నిర్భందిస్తూ, వారి గొంతులను నొక్కే ప్రయత్నం పాలకులు పూనుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలివేన శంకర్, ఎం బాలనర్సింహా మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ ఓ పచ్చి బూటకం అని, ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను వట్టుకుని చిత్రహింసలకు గురిచేసి హతమారుస్తున్నారన్నారు. ఈ ఎన్ కౌంటర్లపై సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కమ్యూనిజాన్ని హత్యలు, నిర్భంధాలతో అడ్డుకోవడం ఎవరి తరం కాదని, అది అనునిత్యం ఉదయించే అరుణ వర్ణమన్నారు. మావోయిస్టులను చంపేందుకు డెడ్లైన్ పెట్టిన కేంద్రం వారితో శాంతి చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అడవుల్లో దాగున్న ఖనిజ సంపదను కారుచౌకగా కార్పోరేట్ శక్తులకు అంటగట్టేందుకు ఆపరేషన్ కగార్ను ఓ పావుగా వాడుకుని నరహత్యలు పూనుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఎంఎల్సి నెల్లికంటి సత్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రానికి కమంటే ముందే ఆవిర్భవించిన సిపిఐ అంతరాలు లేని సమాజ స్థాపనే ధ్యేయంగా నాటి నుండి నేటి వరకు పోరాడుతూనే ఉందన్నారు.

స్వదేశ కాంక్షను తొలూత ప్రజల్లో రగిలించింది సిపిఐ అని స్వతంత్ర సంగ్రామంలో ఎందరో యువకిపోరాలు ప్రాణతర్పణం చేశారని చెప్పారు. ఈ వందేళ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకు లను ఎదుర్కొన్న సిపిఐ ప్రజాక్షేత్రంలో సబ్బండ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత ఎరుపెక్కిన పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని, మరో వందేళ్లయినా ఇదే స్పూర్తి కొనసాగుతుండన్నారు. సిపిఐ శతవసంత ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలో డిసెంబర్ 26న ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగబోతోందని, కనీవినీ ఎరుగని రీతిలో జరిగే ఈనభకు 45 దేశాల నుండి ప్రతినిధులు, దేశ విదేశాల నుండి కవులు, కళాకారులు, మేధావి వర్గ ప్రతినిధులు హాజరువుతున్నారని చెప్పారు.

ఈ శతవసంత ఉత్సవ ముగింపు సభ విజయవంతానికి భారీ ఎత్తున ప్రజలను తరలించాలని, ఇందు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాను భూతిపరులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, జిల్లా కార్యవర్గ సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, నలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర, ఎసి నలీం, కమటం వెంకటేశ్వరరావు, చంద్రగిరి శ్రీనివాస్, వీశంశెట్టి పూర్ణ చంద్రరావు, కంచర్ల జమలయ్య, అడ్డగర్ల తాతాజీ, ఉప్పుశెట్టి రాహుల్, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు వల్లె నర్సింహా, మారపాక అనీల్, కసిరెడ్డి మణికంఠా రెడ్డి, రెహమాన్, లక్ష్మీనారాయణ, జిల్లాలోని మండలాల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.