22-11-2025 06:54:08 PM
చేవెళ్ల (విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలకు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి డిమాండ్ చేశారు. 2016లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ వీటికి పక్కా భవనాలు నిర్మించక అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించిన ప్రభుత్వం, చేవెళ్లలో మాత్రం నిర్లక్ష్యం వహించడం ఆశ్చర్యకరమని అనంతరెడ్డి ప్రశ్నించారు.
అద్దె భవనాల్లో కనీస విద్యా–వసతి సౌకర్యాలు లేక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, సొంత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చీర శ్రీనివాస్ పెద్దోళ్ల మహేందర్ పత్తి సత్యనారాయణ బండారి చంద్రశేఖర్ రెడ్డి అల్లాడ అభిశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.