22-11-2025 06:37:18 PM
ఉన్నత స్థాయికి ఎదిగినా సేవాభావం కలిగి ఉండాలి..
అదనపు ఎస్పీ మహేందర్..
పాపన్నపేట (విజయక్రాంతి): లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించడానికి స్పష్టమైన ప్రణాళికతో క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చేయాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ విద్యార్థులకు సూచించారు. జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంను మండలంలోని మల్లంపేటలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇట్టి శిబిరంకు పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం ముగింపు సమావేశానికి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ విచ్చేసి వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు. శిబిరానికి ముందు, శిబిరం తర్వాత మీలోని ప్రవర్తనను చూసుకోవాలన్నారు. ఉన్నత స్థాయికి వెళ్ళినా సేవా లక్షణం కలిగినప్పుడే జీవితంలో తృప్తి పొందగలమన్నారు.
ఈ క్యాంపు వాలంటీర్ల యొక్క పరివర్తనను, క్రమశిక్షణను, అంకిత భావాన్ని పెంపొందింపజేస్తాయన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి మాట్లాడుతూ.. ప్రారంభం కంటే గొప్ప ముగింపు ముఖ్యమన్నారు. క్యాంపు ప్రారంభం నుండే వాలంటీర్లు గ్రామ సర్వే, శ్రమదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరం, అనేక అవగాహన కార్యకలాపాల ద్వారా ఈ క్యాంపును అద్భుతంగా ముగించారన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలు మీ భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. వాలంటీర్లకు ఏఎస్పీ, డిఐఈఓ లు సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, అధ్యాపకులు, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.