calender_icon.png 4 October, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దృష్టి

04-10-2025 07:58:23 PM

నంగునూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నంగునూర్ మండల శాఖ సమావేశం నిర్వహించారు. శనివారం మండల పార్టీ అధ్యక్షుడు చౌడుచర్ల వెంకటరామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న ఎన్నికల సమరంపై కార్యకర్తలను, అభ్యర్థులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులకు ఆయన ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త మండల వ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటినీ ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు.

కరోనా సమయం నుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తూ, గ్రామపంచాయతీలకు నిధులు అందిస్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్, సీనియర్ నాయకులు కిర్నీ భూపనీ, నారాయణ, వల్లపు రెడ్డి, రాజినికర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.