04-10-2025 08:03:50 PM
మద్యం బెల్టు దుకాణాలను తొలగించండి..
ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి..
తాండూరు (విజయక్రాంతి): మహిళల సహనం, ఓపిక కట్టలు తెగింది. తమ కాలనీలో అడ్డు అదుపు లేకుండా బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుగుతుండడంతో మందుబాబుల ఆగడాలు శృతిమించుతున్నాయని.. మద్యం బెల్టు దుకాణాలు మూసివేయాలని వికారాబాద్ జిల్లా పాత తాండూరులోని తెలుగు గడ్డలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులు తొలగించాలంటూ మహిళలు యువకులు, కాలనీవాసులు ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సార్లు బెల్ట్ దుకాణాలను తొలగించాలని ఫిర్యాదు చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని... సంబంధిత బెల్ట్ దుకాణదారుల వద్ద అధికారులు మామూళ్లు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలనికి చెందిన ఒక వ్యక్తి అతిగా మద్యం సేవించడంతో మృతి చెందాడన్నారు. బెల్టు షాపులను వెంటనే తొలగించాలని ఆబ్కారీ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. లేదంటే కార్యాలయానికి తాళం వేసి ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.