03-08-2025 04:12:24 PM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(President Jajula Srinivas Goud) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే బీజేపీ బీసీల ద్రోహుల పార్టీగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్రంగా రిజర్వేషన్లపై రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలను 48 గంటల్లోగా వాపస్ తీస్కోవాలని, లేదంటే వేలాది మందితో బీజేపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాంచందర్‌రావు విద్యార్థి నేతగా ఉన్నప్పుడు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు సామాజిక రిజర్వేషన్లపై తనకున్న వ్యతిరేక భావాన్ని బీసీ రిజర్వేషన్లపై రుద్దుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50% సీలింగ్ విధించిందంటున్న రాంచందర్‌రావుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో పరిమితి దాటి 60% రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం తెల్వదా అని ప్రశ్నించారు. మండల్ కమిషన్ నుంచి మొదలు బీసీ రిజర్వేషన్లదాకా బీజేపీ.. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉందని మండిపడ్డారు. ఈ వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో బీసీలంతా ఏకమై బీజేపీని రాజకీయంగా భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు.
బీజేపీలో బీసీ నేతలను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగ పెట్టి గెంటివేసే కుట్ర జరుగుతోందని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ అయిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించారని, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను పదవి నుంచి తొలగించారని, ఇక్కడ రాజాసింగ్‌ను పార్టీ నుంచి గెంటేశారని మండిపడ్డారు. ఆఖరికి ప్రధాని మోదీని కూడా దించేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు నేలపట్ల సత్యనారాయణ, ఆదినారాయణ, గోపాలకృష్ణ, రమేష్, లాలయ్య, సాయిబాబా, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు