03-08-2025 06:12:38 PM
హుజూర్ నగర్: హుజూర్ నగర్ ప్రాంతంలో రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజంలో విశేష సేవలు అందించడమే కాకుండా సమాజ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న టియుడబ్ల్యూజె (ఐజెయు)యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు,సీనియర్ జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావుకి తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డును అందజేశారు.
హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ, సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వతంత్ర దినోత్సవ సంబరాలు సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించగా అనంతరం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కోలా నాగేశ్వరరావుకు తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డును శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతులమీదుగా అందుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అన్నారు. జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తున్నారని అభినందించారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధికి చేయూత అందించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులకు భద్రత కల్పించాలన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు ప్రత్యేకంగా మంజూరు చేయాలన్నారు.దీంతో తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు అందుకున్న పట్టణానికి చెందిన కోలా నాగేశ్వరరావును పలువురు జర్నలిస్టులు,వివిధ పార్టీ నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.