బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
- పార్లమెంట్ వద్ద ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి నిరసన
- రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం
- ప్లకార్డులు చేతబట్టి కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నినాదాలు చేసిన రామసహాయం
ఖమ్మం,(విజయక్రాంతి): పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై ద్వేషపూరితంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం పార్లమెంట్ వద్ద తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడటాన్ని భారత్- పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకోవాలని, ఇది తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానపరచడమే అని అన్నారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ పట్ల ద్వేషాన్ని వెళ్ళగక్కారని, పార్లమెంటు రికార్డుల్లో ఈ వ్యాఖ్యలను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ.. " బిజెపి క్షమాపణలు చెప్పాలి", " తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి" అంటూ..నినాదాలతో హోరెత్తించారు.






