‘డబుల్’పై బీజేపీ ధీమా
గతంలో ఎప్పుడు లేనంత సానుకూలత కనిపిస్తోందన్న నేతలు
9 వరకు సీట్లు వస్తాయని అంచనా
తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను ఆశిస్తున్న కమలదళం
తెలంగాణ నుంచి బీజేపీ ప్రాతినిథ్యం పెరుగుతుందన్న నమ్మకం
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో తెలంగాణపై ఎప్పుడూ లేని విధంగా బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు తదితర అంశాలతో పాటు ప్రధాని మోదీ ఛరిస్మా తమకు కలిసి వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు తమ సొంత బలంపై కాకుండా మోదీ ఛరిష్మాతో గెలుస్తామనే ధీమాతో ప్రచారం చేశారు.
అవినీతి రహిత పార్టీగా, ఆకర్షక పథకాలు కాకుండా కేవలం దేశ నిర్మాణంపైనే దృష్టి పెట్టిన బీజేపీ మ్యానిఫెస్టోను ప్రజలు ఆహ్వానించారని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన పరిస్థితులు కూడా తమకు అనుకూలంగా మారుతాయని బీజేపీ అంచనా వేసింది. అందుకే అన్ని పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించి ముందు నుంచే విస్తృత ప్రచారం చేశారు. అధిష్ఠానం కూడా పూర్తి మద్దతునిచ్చింది. మోదీ సహా పార్టీలోని కీలక నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో 11 సభల్లో మోదీ ప్రసంగించడం గమనార్హం.
మజ్లిస్‌కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ స్థానంలో ఈ సారి బీజేపీ ఇంత పోటీ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళి, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరుల అంచనా మేరకు ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తుందని ప్రచారం నడుస్తోంది. 8 నుంచి 12 వరకు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. తాము ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో అవతరిస్తామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్ స్థానాల్లో మళ్లీ..
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆదిలాబాద్ మినహా మిగతా స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులనే నిలబెట్టింది. ఆదిలాబాద్‌లో మాత్రం గోడం నగేశ్‌ను బరిలో నిలిపింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన నగేశ్‌కు ప్రజల్లో ఉన్న మంచి పేరు ఉందని, ఇది తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక కరీంనగర్‌లో బండి సంజయ్‌కు ఉన్న క్రేజ్‌తో మరోసారి విజయం ఖాయమని విశ్వసిస్తోంది. నిజామాబాద్‌లోనూ సులభంగా విజయం సాధిస్తామని, సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారని ఆ పార్టీ నేతలంతా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. సౌమ్యుడు, వివాదరహితుడు, అభివృద్ధిలోనూ కిషన్‌రెడ్డికి ఈసారి మంచి మార్కులు పడ్డాయని పార్టీ అంచనా వేస్తోంది.
మాధవీలత ప్రభావం..
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సెగ్మెంట్ హైదరాబాద్. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో నిలిచిన కొంపెళ్ల మాధవీలత తన విలక్షణమైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ఎంఐఎం సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ముచ్చెమటలు పట్టించింది. మాధవీలత ప్రభావంతో కేవలం ముస్లింలనే తన ఓటు బ్యాంకుగా భావించే ఎంఐఎం ఈసారి పంథాను మార్చుకుంది. తమది లౌకిక పార్టీగా చెప్పుకుంది. పూజారుల వద్ద అసదుద్దీన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. హిందువుల ఇండ్లకు కూడా వెళ్లి ఓట్లు అడిగారు. ఇదంతా కేవలం బీజేపీ ప్రభావం వల్లనేనని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత దూకుడుతో చేసిన ప్రచారానికి మజ్లిస్ భయపడిపోయిందని కూడా చర్చ నడిచింది. అయితే ఇక్కడ ఎంఐఎంతో పాటు బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పక్కాగా విజయం సాధిస్తామని భావిస్తున్న స్థానాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జహీరాబాద్, మెదక్, వరంగల్.
గట్టి పోటీ ఉండే స్థానాలు: హైదరాబాద్, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్.
ఉత్తరం, దక్షిణం తేడా లేకుండా...
దక్షిణ తెలంగాణలో 1999లో మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ తరఫున జితేం దర్‌రెడ్డి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 2019లో ఈ స్థానంలో డీకే అరుణ గట్టి పోటీ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకత్వం నమ్మకంగా ఉంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, నాగర్‌కర్నూల్ నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన పోతుగంటి భరత్ విజయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే పరిస్థితే కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఉత్తర తెలంగాణలో జహీరా బాద్, మెదక్, వరంగల్ స్థానాల్లోనూ బీబీ పాటిల్, రఘునందన్‌రావు, ఆరూరి రమేశ్ గెలుపు నల్లేరుపై నడకేనని భరోసాగా ఉన్నారు. మరోవైపు చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు. కాగా, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి లో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. పక్కాగా గెలుస్తామనే అంచనా లేకపోయినా ప్రత్యర్థులకు సైతం ఈ స్థానా ల్లో అదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక ఖమ్మం, మహబూబాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లుగా అక్కడి నుంచి సమాచారం అందుతోంది.




