6 April, 2026 | 11:44 PM

నాగర్‌కర్నూల్‌లో 69 శాతం పోలింగ్

14-05-2024 02:14 AM

గతం కంటే పెరిగిన ఓటింగ్ శాతం

చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు

నాగర్‌కర్నూల్, మే 13(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 19 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలవగా ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అమ్రాబాద్, లింగాల మండలాల్లో చెంచులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, అల్లంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2,057 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా సాయంత్రం 6 గంటల వరకు 69.01 శాతం పోలింగ్ నమోదయ్యింది. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 62.33శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి గణనీయంగా పెరిగింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు బారులు తీరి ఉండటం గమనార్హం. పోలింగ్ కేంద్రాల వద్ద స్వీప్ కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ సెంటర్‌లను ఏర్పాటు చేయలేదని యువ ఓటర్లు ఆరోపించారు. 

చెదురుమదురు ఘటనలు..

అక్రమ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని నిరసిస్తూ బల్మూరు మండలం మైలారం గామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుపెంటలకు విద్యుత్ సరఫరా లేదని నిరసిస్తూ మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు నిరాకరించారు. అయిజ మండలం 69వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో చాలా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీపీ నర్సింహ్మారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి వర్గం దాడికి యత్నించారు.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాముల గ్రామంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం నేతలు బీజేపీ నేతలపై దాడి చేశారు. దీంతో ఓ కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. కాగా, పోలింగ్ అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఎన్నికల సామగ్రిని జిల్లా వ్యవసాయ మార్కెట్ గోదాములో భద్రపరిచారు. అక్కడి నుంచి మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తున్నారు.