calender_icon.png 6 July, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిపై బీజేపీ దృష్టి

06-07-2025 12:00:00 AM

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నికకు ఇంకా సమ యం పట్టవచ్చు. ఆ ఎన్నికలో జరుగుతున్న జాప్యం అటుంచితే, ఇటీవలే ఆరు రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. కనుక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జేపీ నడ్డా వారసుని ఎంపిక కొద్ది వారా ల్లో ము గియవచ్చు. నిజానికి పొడిగించిన ఆయన పదవీకాలం కూడా ముగిసి నెలలైంది.

పార్టీ నియమావళి ప్రకారం  దేశంలోని సగం రాష్ట్రా ల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయితే గానీ, జాతీయ అధ్యక్షుని ఎన్నికకు మార్గం సుగమం కాదు. ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించుకోవడంతో ఇక జాతీయ అధ్యక్షుని ఎన్నిక ఒక్కటే మిగిలివుంది.  రాష్ట్రాల చీఫ్‌లు నాయకులను ఎంపిక చేయడంలో వారికి సం స్థాగతంగా ఉన్న అనుభవాన్ని అధిష్ఠానం పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టమైంది.

నడ్డాకు వారసుణ్ణి ఎంపిక చేయడంలో పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఆలస్యానికి కారణమనే ఊహాగానాలు వినిపించాయి. సంఘ్ పరివార్‌తో ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే జాతీయ కమల దళపతి పేరు ప్రకటించే అవకాశం ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కీలకమైన ఈ రాష్ట్రాల్లో బీజేపీకి విజయం అందించడం పార్టీ కొత్త అధ్యక్షుడికి సవాల్ కానున్నది.

 దక్షిణాన తమిళనాడు, తెలంగాణపై దృష్టి నిలిపిన బీజేపీ తన వ్యూ హాల అస్త్రాలను ఇప్పటికే బయటకు తీసింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న బీజేపీ, కొత్త పార్టీతో ముందుకెళ్తున్న తమిళ పాపులర్ నటుడు విజయ్‌పై కన్నేసింది. అయితే, బీజేపీతోగానీ, డీఎంకేతో గానీ తమిళ వెట్రి కళగం (టీవీకే) పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో తనే ముఖ్యమంత్రి అభ్యర్థినని విజయ్ ప్రకటించుకున్నారు.

పార్టీ కార్యనిర్వాహక కమిటీ ఈమేరకు తీర్మానం కూడా ఆమోదించింది. ఈ పరిస్థితుల్లో అధికార డీఎంకేను ఎదుర్కోవడంలో అన్నా డీఎంకేతో కలిసి బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుం దనేది చూడాలి. మరోవైపు, బలవంతంగానే అన్నా డీఎంకేను బీజేపీ పొ త్తుకు ఒప్పించిందన్న ఊహాగానాల మధ్య, ఇదీ నిజమేనన్న తీరులో పళనిస్వామి మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా, సీట్ల పంపకం మొదలు ఏ విషయంలోనైనా అన్నాడీఎంకే పెద్దన్న పాత్రలో ఉంటుందని పళినిస్వామి చెపుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో హిందీ భాష పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నది.  ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని బీజేపీని పూర్తిగా తలెత్తుకోవడం అన్నాడీఎంకేకు ఇబ్బందిగా వుంది.  తమిళనాడు అసెంబ్లీ సీట్ల పంపకం చెరి సగంగా ఉండాలని కేంద్ర మంత్రి అమిత్‌షా ఇప్పటికే పళనిస్వామికి ఖరాఖండికి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించిన బీజేపీ, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు నాయకత్వంలో అధికార పీఠం చేజిక్కించుకునే వైపునకు కదులుతున్నది.