15 March, 2026 | 4:16 AM

ఆందోళనతోనే రెట్టింపు బుకింగ్స్

15-03-2026 01:09 AM
  1. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు
  2. గృహ వినియోగదారులకు ఎలాంటి కొరత లేదు
  3. సరఫరాను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలు
  4. ఫిర్యాదులకు 180042500333 టోల్ ఫ్రీ నంబర్
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : కొన్ని రోజులుగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన కారణంగా గ్యాస్ బుకింగ్స్ రెట్టింపు అవుతున్నాయని పౌరసరఫరాలశాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ గృహ వినియోగ సిలిండర్ల సరఫ రాలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయని తెలిపారు.

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యలపై మంత్రి శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సిలిం డర్ల సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత ఇబ్బంది ఉన్నట్టు వెల్లడించారు. ఎల్పీ జీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 811 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.3 కోట్ల గ్యా స్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 11 లక్షలు ఉజ్వల పథకం, 28 లక్షలు దీపం పథకం కింద ఉన్నాయని వెల్లడించారు. అదనంగా 7.5 లక్షల కమర్షియల్ కనెక్షన్లు కూడా ఉన్నాయని చెప్పారు.

ప్రతి నెల రాష్ట్రంలో 58 లక్షల నుంచి 60 లక్షల వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని వివరించారు. గత రెండు రోజు లుగా కూడా ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసినట్టు చెప్పారు. అయితే కమర్షి యల్ సిలిండర్ల విషయంలో కొంత కొరత ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రోజుకు సు మారు 23 వేల కమర్షియల్ సిలిండర్లు అవసరం ఉండగా, ప్రస్తుతం 6,200 మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కమర్షియల్ సిలిండర్ల సరఫరా 20 శాతం పరిమితిలోనే జరుగుతోందని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సివిల్ సప్లయ్ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

గ్యాస్ సరఫరా సంబంధిత ఫిర్యాదుల కోసం 180042500333 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్టు తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.